హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఓటర్ల వివరాల నమోదుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘గరుడ’ యాప్‌ను వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్ సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన ఎలక్టోరల్ ఫామ్‌లు 2022 ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ మేరకు 33 జిల్లాల బూత్ లెవల్ అధికారులకు ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా సీఈవో వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. కిందిస్థాయి బూత్ లెవల్ అధికారులకు రేపటిలోగా శిక్షణను పూర్తి చేయాలని జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి సవరించిన ఫామ్‌ల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త ఎలక్టోరల్ ఫామ్‌ల ద్వారా ఓటర్లను నమోదు చేయడం చాలా సులభమని, ‘గరుడ’ యాప్‌ను వినియోగించుకొంటే పని మరింత వేగంగా పూర్తవుతుందని అధికారులకు తెలిపారు.