బంజారాహిల్స్, డిసెంబర్ 27 : బతికున్న వ్యక్తులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్లు, బోగస్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు సృష్టించడం ద్వారా విశ్రాంత అధికారి పేరిట ఉన్న స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించిన ఓ ముఠాలోని సభ్యులను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దిల్సుఖ్నగర్ సమీపంలోని న్యూ మారుతీనగర్‌లో నివసిస్తున్న ఐ రఘురామ్‌శర్మ (65) రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేసి రిటైరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరుతో షేక్‌పేటలో ఏర్పాటు చేసిన వెంచర్లో ఆయన 35 ఏండ్ల క్రితం 185 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆ వెంచర్ సరిహద్దుల విషయంలో కొన్ని తప్పులున్నాయని, వాటిని సరిచేస్తున్నామని చెప్పిన సొసైటీ అధికారులు.. రఘురామ్‌శర్మ ప్లాట్‌కు చెందిన సేల్‌డీడ్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న సక్కుబాయి సొసైటీలో వివాదాలున్నాయని ఆ కేసులు ముగిసిన తర్వాత సేల్‌డీడ్‌ను తిరిగి ఇస్తామని చెప్పి, మాట తప్పారు. దీంతో రఘురామ్‌శర్మ ఇటీవల బంజారాహిల్స్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఆ స్థలంపై ఈసీ తీసుకోవడంతో షాకింగ్ విషయం తెలిసింది.
రఘురామ్శర్మతోపాటు ఆయన భార్య శారదాదేవి చనిపోయారని, వారి కుమార్తెనంటూ సునీతాశర్మ అనే మహిళ 2021లోనే ఆ ప్లాట్‌ను శాంతికుమార్ అనే వ్యక్తి పేరుమీదకు మార్చినట్టు తేలింది. దీనిపై రఘురామ్‌శర్మ రెండ్రోజుల క్రితం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది. బంజారాహిల్స్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సంతోష్‌కుమార్ (40), అతడి స్నేహితుడు వికాస్ శ్రీవాత్సవ కలిసి సునీతాశర్మ అనే మహిళను తీసుకొచ్చారని.. రఘురామ్‌శర్మ, ఆయన భార్య శారదాదేవి చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ తయారు చేయించడంతోపాటు సునీతాశర్మ పేరిట లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తయారు చేసి ఆ ప్లాట్‌ను శాంతికుమార్ అనే వ్యక్తికి రిజిస్టర్ చేసినట్టు వెల్లడైంది. దీంతో సంతోష్‌కుమార్, వికాస్ శ్రీవాత్సవ, శాంతికుమార్, శ్రీకాంత్ అనే నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. సునీతాశర్మతోపాటు సక్సేనా అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు వివరించారు. నిందితులపై బీఎన్ఎస్లోని 329(3), 324(5), 338, 340(2), 336(3), 318(4), 319(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.