కృష్ణకాలనీ, మే10 : దేవాలయానికి రాజకీయ రంగు పులుమొద్దని వరంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సూచించారు. ఆదివారం భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో భూపాలపల్లి అర్బన్ మాజీ అధ్యక్షుడు కటకం జనార్ధన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. భూపాలపల్లిలో తిరుమల తిరుపతికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని అన్ని వర్గాల ప్రజల నిర్ణయంమేరకు మంజూర్నగర్లో వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ ఆలయంపై కాంగ్రెస్ నాయకులు అనైతికంగా కమిటీ వేసి రాజకీయరంగు పులుమడం సిగ్గుచేటని మండిపడ్డారు. ట్రస్టు ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ నా యకుడు అనిల్నే శాశ్వత ధర్మకర్తగా ఉంచామని గుర్తుచేశారు. కోర్టు సెలవుల్లో దొంగ చాటున, అనైతికంగా దేవాలయ కమిటీవేసి, ఆలయం తలుపులు మూసి ప్రమాణస్వీకారం చేశారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన ను, తన భర్త మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఒక తీవ్రవాదిలా ఆలయం నుంచి పోలీస్ స్టేషన్కు లాకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత తామే దేవాదాయ శాఖకు అప్పగిస్తామని చెప్పామని వివరించారు.