గద్వాల/గద్వాల అర్బన్, ఆగస్టు 31 : గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపికలో నెలకొన్న లొల్లి ముగిసింది. పాలక మండలిని ఎమ్మెల్యే వర్గానికే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గిరిని కేటీదొడ్డి మండలానికి చెందిన కుర్వ హనుమంత్‌కు కేటాయించగా.. వైస్ చైర్మన్‌గా గంగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, డైరెక్టర్లుగా చంద్రశేఖర్‌రెడ్డి, చాకలి ఆంజనేయులు, తెలుగు నర్సింహులు, తిరుపతి, విశ్వగయన్ ఆచారి, లలితమ్మ, నర్సింహారాజ్, కల్యాణం సోమన్న, శాంతమ్మ, బజారి, షేక్ షాహిన్బాన్, రామయ్యపాటు పలువురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి కోసం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత.. కాంగ్రెస్ పెద్దలతో తీవ్రస్థాయిలో మంతనాలు జరిపారు. చివరకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి వైపే పార్టీ పెద్దలు మొగ్గుచూపారు. దీంతో జెడ్పీ మాజీ చైర్పర్సన్ ప్రతిష్ఠ పార్టీలో మసకబారినట్టు పలువురు చర్చించుకుంటున్నారు.