హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): కష్టపడేతత్వం, వినూత్న ఆలోచన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన హైదరాబాద్ యువకుడి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. హైదరాబాద్ పార్సిగుట్టకు చెందిన ఒక మాజీ వెల్డర్ కుమారుడు గడ్డం శివగణేశ్ తన స్టార్టప్‌తో సరికొత్త సంచలనాలు సృష్టించడంతోపాటు ‘ఫోర్బ్స్’ జాబితాలోకి చోటు దక్కించుకోవడాన్ని అభినందిస్తూ సోమవారం ఎక్స్‌లో కేటీఆర్ ప్రత్యేక పోస్ట్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆర్థిక అవసరాలన్నింటినీ ఒకేచోట తీర్చేలా హైదరాబాద్ కేంద్రంగా ఒక ప్రత్యేక బ్యాంక్‌ను నిర్మించాలనేది శివగణేశ్ లక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు. శివగణేశ్లోని సరికొత్త ఆలోచనలకు ప్రాణం పోసి, దానిని నిజం చేయడంలో తెలంగాణ ప్రభుత్వ ఆవిషరణల వేదిక ‘టీ-హబ్’ కీలక పాత్ర పోషించడం ఎంతో సంతోషకరమని తెలిపారు.
‘ఫోర్బ్స్ అండర్ 30’ జాబితాలో చోటు
శివగణేశ్ సాధించిన అంతర్జాతీయ గుర్తింపును కేటీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన అద్భుతమైన ఆలోచనకు గానూ ‘ఎమర్జెంట్ వెంచర్స్’ నుంచి లక్ష డాలర్ల గ్రాంట్ లభించింది. ప్రతిష్ఠాత్మక ‘ఫోర్బ్స్ 30 అండర్ 30-ఆసియా 2026’ జాబితాలో, ఫైనాన్స్, వెంచర్ క్యాపిటల్ క్యాటగిరీలో శివగణేశ్ చోటు దక్కించుకున్నారు. ఆర్బీఐ పేమెంట్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, విద్యార్థులు కేంద్రంగా పనిచేసే ఈ ఆర్థిక సంస్థకు బలమైన పునాది వేసేందుకు శివగణేశ్ స్టార్టప్ ఇప్పుడు రూ.10కోట్ల నిధులను సేకరించింది. శివగణేశ్ భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.