కొడంగల్, జూన్ 25: కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసగా సాగింది. స్థానిక ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని చెక్కులను పంపిణీ చేయడం వివాదానికి కారణమైంది. ప్రోటోకాల్ పాటించకుండా, ఏ అర్హతతో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారని తిరుపతిరెడ్డిని బీఆర్ఎస్కు చెందిన దౌల్తాబాద్ నిలదీశారు. దీంతో మహిపాల్‌కు, తిరుపతిరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ..ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతిరెడ్డి..కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన చెక్కులనే ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు. అధికారిక కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు తేడా లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి తిరుపతిరెడ్డి స్పందిస్తూ.. సీఎం తరఫున తాను చెక్కులు పంపిణీ చేస్తున్నానని చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఇలానే చేశారని కాంగ్రెస్ వైఖరిని సమర్థించే ప్రయత్నం చేశారు.