హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలకు సంబంధించి అద్దెలు, డైట్ చార్జీలు ఎప్పటికప్పుడు చెల్లించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంక్షేమశాఖల బడ్జెట్ సన్నాహక సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం వివిధ శాఖ నుంచి ఎస్సీ, ఎస్టీ శాఖలకు రావాల్సిన నిధులపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి నిధులు రాబట్టడంలో వేగం పెంచాలని ఆదేశించారు. గిరిజనుల భూముల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఎస్టీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీ హరిత, ఇరిగేషన్ సెక్రటరీ పాటిల్ పాల్గొన్నారు.