గాంధారి, సెప్టెంబర్ 30: రైతులకు రుణమాఫీతోపాటు ఇతర హామీలను అక్టోబర్ 10లోగా నెరవేర్చకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే సురేందర్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో కామారెడ్డి-బాన్సువాడ ప్రధాన రహదారిపై సోమవారం మహాధర్నా నిర్వహించారు. రెండుగంటలకుపైగా కొనసాగిన ఆందోళనతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచి పోయాయి. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రైతులను దారుణంగా మోసం చేసిందని సురేందర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిందేనని రైతులు, అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతుభరోసా ఎకరాకు రూ.15 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
ప్రభుత్వం సిగ్గుపడాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆసరా పింఛన్లను విరాళంగా ఇచ్చి రోడ్లు వేయించుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలని కేటీఆర్ దుయ్యబట్టారు. వృద్ధులు దాతలుగా మారి సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి ఉంటే మీ పాలన ఎందుకు? అని ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ఆసరా పింఛన్లు అవ్వ, తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరా అవుతున్నాయని పేర్కొన్నారు. రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని ప్రశ్నించారు. మాజీ సర్పంచుల సంగతి సరే చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు కావల్సిందేనా? అని ప్రశ్నించారు.