హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కేవీఏఆర్‌హెచ్ విద్యుత్తు బిల్లింగ్‌పై నిపుణులతో సమగ్ర అధ్యయనం చేయించాలని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు ఎం రవికుమార్, కేకే మహేశ్వరి, శ్రీనివాస్ గరిమెళ్ల, కే సుధీర్‌రెడ్డి, డీ శ్రీనివాస్‌రెడ్డి, స్వామిగౌడ్, రాజమహేందర్‌రెడ్డి, అనిల్ అగర్వాల్, ప్రకాశ్ గోయెంకా, వెంకట్ ఎన్కేకే మాట్లాడుతూ.. కేవీఏఆర్‌హెచ్ బిల్లింగ్‌పై సమగ్ర అవగాహన కల్పించకుండానే డిస్కం అధికారులు లీడింగ్ పవర్ ఫ్యాక్టర్‌ను ఆన్‌బ్లాక్ (ఓపెన్) చేశారని, దీంతో బిల్లులు 100 నుంచి 300 శాతం మేరకు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అమాంతం పెరిగిన ఈ బిల్లులను తాము కట్టలేమని స్పష్టం చేశారు. ఆటో పవర్ ప్యాక్టర్ కంట్రోల్ ప్యానళ్లు పెట్టుకోవాలంటే లక్షల్లో ఖర్చవుతుందని, స్టాటిక్ వీఏఆర్ జనరేటర్‌ను అమర్చుకోవడం పరిశ్రమలకు భారంగా మారిందని వాపోయారు. హెచ్‌టీ సర్వీసులకు రాత్రి అలవెన్సులో కోత పెట్టడం దారుణమని, దీంతో హెచ్‌టీ పరిశ్రమలు ఒక్కో యూనిట్‌కు రూ.1.50 చొప్పున నష్టపోతున్నాయని తెలిపారు.
హైదరాబాద్‌లోని పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపలికి తరలించే హిల్ట్ పాలసీపై స్పష్టత లేదని పారిశ్రామికవేత్తలు ఆరోపించారు. పరిశ్రమల తరలింపునకు ప్రభుత్వం జీవోను జారీచేసినప్పటికీ ఇంతవరకు సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. ఓఆర్ఆర్ వెలుపల కొత్త పారిశ్రామికవాడలు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయకముందే పరిశ్రమలను ఎలా తరలించగలమని ప్రశ్నించారు. హిల్ట్ పాలసీపై పారిశ్రామిక సంఘాలతో సంప్రదింపులు జరిపి, అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.