హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘పట్టుదల, సంకల్ప బలం ముందు కష్టాలన్నీ ఓడిపోతాయి. ఆ విషయం అమృత్, ఉదయ్ జీవితాల ద్వారా స్పష్టమైంది. మామూలు స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగిన వీరిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. డెలివరీ బాయ్‌గా జీవితాన్ని ప్రారంభించి పట్టుదలతో చదివి లాయర్‌గా ఎదిగిన అమృత్, క్యాబ్ డ్రైవర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి న్యాయవాదిగా ఎదిగిన ఉదయ్ బుధవారం కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
కేటీఆర్ ఆశీర్వాదం తీసుకోవాలన్న అమృత్ కోరిక మేరకు అతని మిత్రుడైన అంబటి అర్జున్‌కుమార్ చొరవ తీసుకున్నారు. అర్జున్ అభ్యర్థనకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు అమృత్, ఉదయ్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ‘సాధారణ స్థితి నుంచి న్యాయవాదులుగా ఎదగడం స్ఫూర్తిదాయకం. మీ పట్టుదల, సంకల్పం అభినందనీయం’ అని వారిని కేటీఆర్ ప్రశంసించారు. సాధించాలనే సంకల్పం ఉంటే ఎవరైనా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని, ఈ ఇద్దరు యువకుల విజయగాథలే మన ముందున్న తార్కాణాలని కొనియాడారు. గతంలో డొమినోస్ డెలివరీ బాయ్ అయిన అమృత్ లాయర్‌గా బార్ కౌన్సిల్లో నమోదు చేయించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసి లాయర్‌గా ఎదిగిన ఉదయ్‌తో కేటీఆర్ ముచ్చటించారు. ఆయన జీవిత ప్రయాణం, కుటుంబనేపథ్యం, ఎదురైనా ఇబ్బందులు.. వాటిని అధిగమించిన తీరు గురించి తెలుసుకున్నారు. ‘జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నించాలి’ అంటూ కేటీఆర్ వారికి ఉద్బోధించారు. డెలివరీ బాయ్‌గా అష్టకష్టాలు పడ్డ అమృత్.. ఉపాధి కోసం క్యాబ్ నడిపిన ఉదయ్ పోరాడి లాయర్ కల నెరవేర్చుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు.