CM KCR | రంగారెడ్డి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావును గతేడాది నవంబర్‌లో గుత్తికోయలు అత్యంత దారుణంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడింది. ఇప్పటికే ఆర్థిక సాయాన్ని అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా శ్రీనివాస్ రావు కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్.. శ్రీనివాస్ రావు భార్య భాగ్యలక్ష్మికి ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ఆమెకు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం కల్పించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఫారెస్టు డిపార్ట్మెంట్ వారు చాలా కష్టపడి మన కోసం అడవులను పెంచుతున్నారు అని కేసీఆర్ తెలిపారు. కానీ దుర్మార్గులు ఒక ఫారెస్టు అధికారిని దారుణంగా చంపేశారు. ఆ ఫారెస్టు అధికారి భార్యకు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం కల్పించి, నియామక పత్రాన్ని అందజేశాం. కొంత డబ్బులు కూడా సాయం చేశాం. మనిషిని అయితే తేలేం. కానీ వారికి ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు హామీ ఇస్తున్నాను. మీ మీద దాడులు జరగకుండా ఉండేందుకు పోలీసు స్టేషన్ల మాదిరిగా ఫారెస్టు స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. ఒక 20 వరకు స్టేషన్లు అవసరం అవుతాయన్నారు. వాటిని వెంటనే మంజూరు చేద్దాం. ఫారెస్టు డిపార్ట్మెంట్ను పటిష్టం చేద్దాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
పెద్ద దిక్కును కోల్పోయిన తమకు కుటుంబ పెద్దగా, తండ్రిలాగా సీఎం కేసీఆర్ అండగా నిలిచారని శ్రీనివాస్ రావు భార్య భాగ్యలక్ష్మి భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పటికే ఇంటి స్థలం, ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు భాగ్యలక్ష్మీ పేర్కొన్నారు.