Rani Lakshmi Bai | భీమదేవరపల్లి, జూలై 30 : ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన ధీరవనిత ఝాన్సీ లక్ష్మీభాయి. అస్థిత్వం, ఆత్మాభిమానం కోసం తెల్లవారిని కునుకు లేకుండా చేసింది. వీపుకు చంటిబిడ్డను కట్టుకుని అశ్వంపై ఒక చేత బల్లెం, మరో చేత ఖడ్గం పట్టి యుద్దం చేసింది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించింది. అయితే ఆమె వారసత్వపు ఛాయలు ఇంకా పదిలంగానే ఉన్నాయి. రాజ్యాధికారం కోల్పోయిన తరువాత ఆమె వారసులు పొట్ట చేతపట్టుకుని కటిక దారిద్య్రంలో జీవనం సాగించారు.
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. మను అని కూడా పిలుస్తారు. మణికర్ణిక నాలుగేళ్ళ ప్రాయంలోనే తల్లి మరణించింది. ఆమె తండ్రి రెండవ బాజీరావు పెష్వా వద్ద సైన్యాధ్యక్షుడుగా పనిచేశాడు. దీంతో మణికర్ణిక కత్తిసాము, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యల్లో ఆరితేరింది. మణికర్ణికకు 13ఏళ్ళ ప్రాయంలో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నేవల్కర్తో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఆమె పేరు మణికర్ణిక నుంచి ఝాన్సీ లక్ష్మీబాయిగా మారింది. లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించి నాలుగు నెలల్లోనే మరణించాడు. అప్పటి నుంచి ఝాన్సీ భర్త మానసికంగా కృంగిపోయాడు. దీంతో కుటుంబసభ్యుల సలహా మేరకు దూరపు బంధువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడు దామోదర్‌రావును పసిప్రాయంలోనే దత్తత తీసుకున్నారు. గంగాధరరావు అనారోగ్యంతో మరణించే సమయానికి భారత గవర్నర్ జనరల్‌గా డల్హౌసి ఉన్నాడు. దత్తత కుమారుడు దామోదర్‌రావు ఆమె రక్త సంబంధం కాదని, అతను సింహాసనం అధిష్టించరాదని డల్హౌసి తేల్చి చెప్పాడు. దీంతో ఆమె ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన న్యాయవాదితో లండన్ కోర్టులో దావా వేసింది. వాదోపవాదాలు విన్న తరువాత కోర్టు ఆ కేసును కొట్టివేసింది. ఆంగ్లేయులు ఆమె రాజాభరణాలు తీసేసుకుని, ఆమెకు రావాల్సిన పింఛను లాగేసుకున్నారు. ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా హుకుం జారీచేశారు. దీనికి లక్ష్మీబాయి నిరాకరించింది. స్వతంత్రంగా సైన్యాన్ని తయారు చేసుకుని తాంతియాతోపే నాయకత్వం వహించిన తిరుగుబాటు దారులతో చేరింది. గ్వాలియర్‌లో జరిగిన యుద్దంలో తీవ్రంగా గాయపడిన ఝాన్సీ కొద్దిరోజులకు వీరమరణం పొందింది. గ్వాలియర్ యుద్దంలో ఝాన్సీని ప్రస్తావిస్తూ విప్లవకారుల్లోకెల్లా ఆమె అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని జనరల్ రోస్ కితాబిచ్చాడు.
ఝాన్సీ వారసుల క్రమపట్టికపై ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. ఆద్యంతం ఝాన్సీ జీవితం, ఆమె వారసుల పరంపరపై ఎవరు పరిశోధన చేశారో తెలియదు కానీ తెగ వైరల్ అవుతుంది. వాట్సప్‌లో ఝాన్సీ వారసులపై ఇలా రాయబడింది.. ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం తరువాత ఆమె కుమారుడు దామోదర్‌రావు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సాధారణ జీవితం గడిపినట్లు తెలుస్తోంది. ఝాన్సీ దత్తత కుమారుడు దామోదర్‌రావు అతని తరువాత ఐదు తరాలు ఇండోర్‌లో అనామకంగా జీవించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వారిని గుర్తించడానికి ప్రయత్నించలేదు. వాస్తవానికి రాణి వంశస్థులు 2011వరకు ఇండోర్‌లోనే ఉన్నారు. అనంతరం నాగ్‌పూర్‌కు మారారు. ఇప్పుడు ఆరవ తరం వారసుడు ఒక సాప్ట్వేర్ కంపనీలో పనిచేస్తూ అనామక జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రస్తుతం వీరంతా తమ పూర్వీకుల ఝాన్సీతో సంబంధాన్ని ‘ఝాన్సీవాలే’ అనే పేరుతో కొనసాగిస్తున్నారు.
ఝాన్సీ లక్ష్మీబాయి మరణాంతరం ఆమె దత్తత తీసుకున్న కుమారుడు దామోదర్‌రావు బ్రిటీష్ పాలకుల కస్టడీలో ఇండోర్‌లో 46 సంవత్సరాలు గడిపాడు. రాణి మనవడు లక్ష్మణ్‌రావు, మునిమనువడు కృష్ణారావు ఇండోర్‌లోనే ప్రవేటు టైపిస్టుగా పనిచేసి కఠిక దారిద్య్రంలో మరణించాడు. స్వాతంత్య్ర సమరయోధుల రాజకుంటుంబం నుంచి వచ్చినప్పటికీ వారికి నగదు పింఛను(భరణం) రాజకీయ భత్యాలు ఇవ్వబడలేదు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ యోగేష్ అరుణ్‌రావు ఝాన్సీవాలే రాణి లక్ష్మీబాయి కుటుంబంలో ఆరవతరం వారసుడు. అతను ప్రస్తుతం నాగపూర్‌లో అతని భార్య ప్రీతి, పిల్లలు ప్రీయేష్, ధనికాతో కలిసి జీవిస్తున్నాడు. అతని తండ్రి అరుణ్‌రావు ఝాన్సీవాలే కూడా అతనితోనే ఉన్నాడు. అరుణ్‌రావు మధ్యప్రదేశ్ విద్యుత్‌బోర్డులో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వీరంతా ఇండోర్‌లోని ధన్వంతరి నగర్లో ఇల్లు కొనుగోలు చేశారు.
రాణి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటీషర్లతో పోరాడుతూ తీవ్రగాయాలు పొందిన తరువాత తన కుమారుడు దామోదర్‌రావును విశ్వాపాత్రులకు బంగారు నగలు, డబ్బుతో అప్పగించింది. అనంతరం ఆమె 1857 జూన్ 18వ తేదీన మరణించింది. బ్రిటీష్‌వాళ్లు ఝాన్సీ వంశాన్ని అంతం చేయడానికి రాకుమారుడు దామోదర్‌రావును అంతం చేయాలని ప్రయత్నించారు. దీంతో అతని కాపలాదారులు దామోదర్‌రావును అడవిలో దాచారు. చివరికి ఝాలావాద్ రాజు పృథ్వీసింగ్ సిఫారసు మేరకు బ్రిటీష్ అధికారి సర్ రాబర్ట్ హామిల్టన్ దామోదర్‌రావుకు ఇండోర్ రెసిడెన్సీ ప్రాంతంలో నివాసం మంజూరు చేశాడు. అతనికి సంవత్సరానికి రూ. 10,000 పింఛను ఇచ్చారు. దామోదర్‌రావు 1906లో 57సంవత్సరాల వయసులో మరణించాడు. అతని కుమారుడు లక్ష్మణ్‌రావుకు బ్రిటీష్‌వాళ్ళు నెలకు రూ. 200 పింఛను ఇచ్చారు. స్వాతంత్య్రం తరువాత భారత ప్రభుత్వం వారిని రెసిడెన్సీ ఇంటి నుంచి తరలించింది. దీంతో వాళ్ళు ఇండోర్ రాజ్వాడా పీర్గలీలో అద్దె ఇంట్లో కష్టజీవితం గడిపారు.
మేము ఝాన్సీ రాణి వంశస్థులం. కొంతమంది మా పూర్వీకుల గురించి తెలుసుకుని మమ్మల్ని శ్రీమంత్ అని పిలుస్తారు. కానీ మేము సాధారణ జీవితం గడపాలనుకుంటున్నాం. నాగపూర్‌లో మా గురించి ఎవరికీ తెలియదు. మేము ఝాన్సీ కోటను చూడటానికి వెళ్ళినప్పుడు టికెట్ కొనాల్సి వచ్చింది. తమ కుటుంబాన్ని ఈ దేశం మరిచిపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. మా తండ్రి అరుణ్‌రావు ఝాన్సీకి రాజు అయి ఉండాలి. నేను యువరాజు. కానీ ఇప్పుడు మేము అలా గుర్తుంచుకోబడాలను కోవడం లేదు. ఈ విధంగా ఝాన్సీ రాణి వంశవస్థులు సాదారణ జీవితం గడుపుతున్నప్పటికీ వారి త్యాగాలను దేశం మరిచిపోయింది.