దేవరుప్పుల, జూలై 6: స్వాతంత్య్ర సమరయోధుడు, దేవరుప్పుల గ్రామ ప్రథమ సర్పంచ్ నీలారపు ఎర్రయ్యయాదవ్ (101) శనివారం ఉదయం అనారోగ్యంతో తన ఇంట్లో కన్నుమూశారు. స్వాతంత్య్ర పోరాటంలో జైలు జీవితం గడిపిన ఎర్రయ్యను.. రాజకీయ ఖైదీగా గుర్తించి స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి తామ్రపత్ర గ్రహీత ఎర్రయ్య.. నిజాం కాలంలో రజాకార్లకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారు.
సింగపూర్ బీచ్‌లో కోదాడ యువకుడి మృతి
కోదాడ రూరల్, జూలై 6: సింగపూర్‌లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కోదా డ పట్టణానికి చెందిన చౌడవరపు శ్రీనివాసరావు రెండో కుమారుడు పవన్ (25) సింగపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది ఫిబ్రవరిలోనే ఇక్కడి నుంచి వెళ్లాడు. రెండు, మూడు నెలల్లో ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇటీవలే వీసా వచ్చింది. శుక్రవారం సింగపూర్‌లోని ఓ బీచ్‌లో పవన్ శవంగా కనిపించాడు. ఆ యన వద్ద లభించిన ఆధారాలతో అక్కడి పోలీసులు పవన్ స్నేహితులను విచారిస్తున్నా రు. కుమారుడి మరణ వార్తతో తల్లిదండ్రు లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఆసిఫాబాద్‌లో అంగన్వాడీల రిలే దీక్ష
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్ : సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీలు శనివారం కుమ్రం భీం ఆసిఫాబాద్‌లోని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తకువ డబ్బులు చెల్లించి ఇంటికి పంపించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 10ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్ట్‌లపై బీఆర్ఎస్ నిరసన
ఎల్లారెడ్డిపేట : నిరుద్యోగ మార్చ్ సందర్భంగా నిరుద్యోగులను, విద్యార్థి సంఘాల నేతలను, పార్టీల నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు దేవరాజు దుయ్యబట్టారు.
పింఛన్లు పెంచాలని సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి
సిద్దిపేట కలెక్టరేట్ : కాంగ్రెస్ హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) నాయకులు సిద్దిపేట కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం అధికారికి వినతిపత్రం అందజేశారు. పింఛన్‌ను రూ.6 వేలకు పెంచడంతోపాటు వృద్ధ్దాప్య, బీడీ, గీత కార్మిక, ఇతర పింఛన్లు కూడా పెంచాలని కోరారు.
విద్యార్థినులపై ఎలుకల దాడి.. నేతల నిరసన
డిండి : నల్లగొండ జిల్లా డిండిలోని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహంలో వారం వ్యవధిలో 16 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగాయని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల ఎదుట ధర్నా చేశారు.