హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీ కల్పిస్తున్న మహాలక్ష్మి ఉచిత ప్రయాణం ద్వారా 200 కోట్ల సార్లు మహిళలు ప్రయాణం చేశారని తెలంగాణ ఆర్టీసీ మంగళవారం ప్రకటించింది. మహిళల ఉచిత ప్రయాణ విలువ సుమారు రూ.6,700 కోట్లు ఉంటుందని తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్స్టేషన్లలో సంబురాలు నిర్వహిస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ సంబురాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
రాచమర్యాదల వివాదంలో ఇద్దరిపై వేటు ; కమిషనరేట్‌కు అటాచ్ చేసిన సీపీ
నందిపేట, జూలై 22: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఠాణాలో వెలుగు చూసిన రాచమర్యాదల వ్యవహారంపై పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఠాణాలోనే కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టిన ఉదంతాన్ని ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం ‘కాంగ్రెస్ నేతలకు రాచమర్యాదలు’ శీర్షికన వెలుగులోకి తేగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తమ అదుపులో ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇన్చార్జిగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ ముత్యంరావు, కానిస్టేబుల్ సతీశ్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తించారు. వారిని పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో ఏఎస్సై టోపి సైతం టేబుల్‌పై స్పష్టంగా కనిపించగా ఆ సమయంలో అతడు భోజనానికి వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ నేతల ప్రచార యావతో ఇద్దరు పోలీసులు క్రమశిక్షణ చర్యలకు గురికావాల్సి వచ్చింది.