హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రజక, నాయీ బ్రాహ్మణులకు అమలు చేస్తున్న 250 యూనిట్ల ఉచిత్ విద్యుత్ పథకానికి సంబంధించి బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సంఘ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు. ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.100 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో బిల్లులు కట్టాలని నాయీబ్రాహ్మణులు, రజకులను విద్యుత్ అధికారులు వేధిస్తూ, కనెక్షన్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా మార్చి పాలకమండలిని నియమించాలని, బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించాలని, రూ.5లక్షల జీవిత బీమా కల్పించాలని కోరారు. సమావేశంలో సంఘ నేతలు మాచర్ల రవి, గోలనుకొండ అశోక్, చందు శ్రీనివాస్, సింగిరాల వెంకటస్వామి, శ్రీరాములు నరేశ్, పగిడిపాల స్వామి, జంపాల శ్రీనివాస్, కొత్వాల రవి, రాజు, శ్రీరాములు, భూషణం పాల్గొన్నారు.