Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : కుల వృత్తిదారులకు 250 యూనిట్ల దాకా ఉచిత కరెంటు ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం చేదోడుగా ఉంటే.. కాంగ్రెస్ సర్కారు వచ్చీరాగానే దానికి మంగళం పాడి వారిపై ఆర్థిక భారం మోపింది. ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు అధికారికం గా ప్రకటించకుండా క్షేత్రస్థాయిలో బిల్లులు వసూ లు చేస్తున్నది. ఇన్నిరోజులు ప్రశాంతంగా ఉన్న వృత్తిదారులు తాజా నెలలో వచ్చిన కరెంటు బిల్లులను చూసి బెంబేలెత్తుతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అలాంటిదేమీ లేదని చెబుతున్నా తమకు వచ్చిన మౌఖిక ఆదేశాలతో బిల్లులు జారీ చేసి, వసూలు చేస్తున్నట్లు కిందిస్థాయి సి బ్బంది స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పథ కం తాలూకు రీయింబర్స్మెంట్ లేక బిల్లులు జారీ చేస్తున్నట్లు కుండబద్దలు కొడుతున్నారు.
కుల వృత్తిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 2021 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెయిర్ సెలూన్లు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చింది. ఈ పథకం నిన్నటిమొన్నటిదాకా నిర్విఘ్నంగా కొనసాగింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 25 వేల దాకా లబ్ధిదారులున్నారు. 250 యూనిట్లు దాటితే మిగతా యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించారు. గతంలో ప్రభుత్వ సబ్సిడీతో జీరో బిల్లు జారీ అయ్యేది. ఈ క్రమంలో గత నెల దాకా లబ్ధిదారుగా ఉన్న ఓ సెలూన్ యజమానికి తాజా నెలలో సాధారణ వినియోగదారుడి మాదిరిగానే బిల్లు వచ్చింది. యూఎస్సీ నం.112243311 సెలూన్ షాప్‌నకు కరెంటు బిల్లు రూ.992.00 వచ్చింది. గత నెలలో ఇదే షాపునకు రూ.1065 బిల్లు వస్తే ప్రభుత్వ సబ్సిడీగా పేర్కొని జీరో బిల్లు జారీ చేశారు. ఇదేంటని లబ్ధిదారు ప్రశ్నిస్తే బిల్లు చెల్లించాల్సిందేనని విద్యుత్తు అధికారులు స్పష్టం చేయడంతో తప్పని పరిస్థితుల్లో బిల్లు చెల్లించాడు.
సెలూన్లు, ధోబీఘాట్లకు నెలకు 250 యూ నిట్ల ఉచిత కరెంటు పథకాన్ని నిలిపివేశారా? అని అధికారులను అడిగితే అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. సైబర్‌సిటీ సర్కిల్ ఎస్ఈ వెంకన్నను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా పథకాన్ని అమలు చేస్తున్నామని, ఎవరికైనా బిల్లు జారీ అయితే తమ దృష్టికి తేవాలని చెప్పా రు. కాగా బిల్లు జారీ అయిన గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని వసంత్‌నగర్ సెక్షన్ ఏఈ సత్యవాణిని సంప్రదించగా తమకు మౌఖిక ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. సెలూన్లు, ధోబీఘాట్లకు కూడా కరెంటు బిల్లులు జారీ చేసి వసూ లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నందునే బిల్లులు జారీ చేస్తున్నట్టు చెప్పారు.