బంజారాహిల్స్, నవంబర్ 30: సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘరా నా కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంకు చెందిన కాంతిదత్ తొనంగి (30) గత నాలుగేండ్ల నుంచి అనేక స్టార్టప్ కంపెనీలను నెలకొల్పి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు జనాన్ని నమ్మించాడు. ఆ క్రమంలో సస్టెయిన్ కార్ట్ పేరుతో ఓ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేశాడు. దాని ద్వారా 1,100 బ్రాండ్లను విక్రయిస్తానని, పర్యావరణ హితమైన ఉత్పత్తులను ప్రోత్సహిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాడు. పలు ర కాల ఉత్పత్తులకు హీరోయిన్లు కీర్తి సురేశ్, స మంత తదితర సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని పెట్టుబడిదారుల నుం చి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. కాగా, ఏడాది క్రితం ఓ ప్రముఖ ఆభరణాల సంస్థ ప్రారంభోత్సవంలో జూబ్లీహిల్స్‌కు చెందిన తిప్ప ల శ్రీజరెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తకు పరిచయమైన కాంతిదత్.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో తృతీయ ఫైన్ జువెలర్స్ పేరుతో ఆభరణా ల వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నానని, దానికి బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకువస్తున్నాన ని నమ్మించాడు.
తన సంస్థలో పెట్టుబడి పెట్టాలని కోరగా.. రూ.2.5 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శ్రీజరెడ్డి అంగీకరించారు. దీంతో తృతీయ జువెలర్స్‌లో తనతోపాటు శ్రీజరెడ్డిని డైరెక్టర్‌గా చేర్చుకున్న కాంతిదత్.. పరిణీతి చోప్రా కు పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి స్టోర్ ప్రారంభానికి ముందే శ్రీజరెడ్డి నుంచి రూ.1.5 కోట్లు తీసుకున్నాడు. నిరుడు సెప్టెంబర్‌లో ఆ స్టోర్ ప్రారంభం కోసం పరిణీతి చోప్రా ను తీసుకువచ్చిన కాంతిదత్.. ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఇవ్వకుండా ఆ డబ్బును తన సంస్థలో పెట్టుబడి పెట్టేలా ఒప్పించాడు. దీంతో స్టోర్ ప్రారంభానికి వచ్చిన పరిణితి చో ప్రా.. తన పారితోషికాన్ని కూడా తృతీయ జువెలర్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు ప్రకటించడంతో అక్కడే ఉన్న శ్రీజరెడ్డి షాక్‌కు గురయింది. తనకు ఎలాంటి సమాచా రం ఇవ్వకుండానే పరిణితి చోప్రా ను భాగస్వామిగా చేర్చుకోవడంతో తాను ఇచ్చిన రూ.1.5 కోట్లు ఏం చేశావని ప్రశ్నించింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే శ్రీజరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి, ఆమె రాజీనామా చేస్తున్నట్లు కంపెనీల రిజిస్ట్రార్ లేఖను పంపిన కాంతిదత్.. శ్రీజరెడ్డి స్థానంలో తన తల్లి శ్రీదేవి డైరెక్టర్‌గా చేర్చుకున్నాడు.
కొన్నాళ్ల తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తిని డైరెక్టర్‌గా చేర్చుకుని రూ.5.8 కోట్లు వ సూలు చేశాడు. ఈ విషయాలను తెలుసుకున్న శ్రీజరెడ్డి.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ, చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. పరారీలో ఉన్న కాంతిదత్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాగా, కాంతిదత్‌పై ప్రవీణ్‌రెడ్డి ఇప్పటికే సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా కేసు నమోదయినట్టు తెలుస్తున్నది. ఒక్క జూబ్లీహిల్స్లోనే కాంతిదత్ రూ.40 కోట్లకుపైగా మోసాలకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.