రంగారెడ్డి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ)/కందుకూరు : అభివృద్ధి పేరిట రైతుల భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫార్మాసిటీ కోసం కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై రైతులు తిరగబడిన ఘటన మరువకముందే కందుకూరు మండలంలో ఫోర్త్‌సిటీ సర్వేకు వచ్చిన అధికారులకు అదే పరిస్థితి ఎదురైంది. ఒక రైతు ఏకంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తమకు తెలియకుండానే తమ భూముల్లో అధికారులు సర్వే చేస్తుండటంతో రైతులు భగ్గుమన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ కలెక్టరేట్ వెనుక ప్రాంతంలో మంగళవారం సర్వే చేసేందుకు వచ్చిన అధికారులతో రైతులు వాగ్వివాదానికి దిగి పనులను నిలిపివేశారు. దీంతో అధికారుల సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు రైతులను ఆదిబట్ల ఠాణాకు తరలించారు.
అయినప్పటికీ సర్వే పనులను మాత్రం సాగనివ్వలేదు. రైతులను బలవంతంగా ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు.. అడ్డువచ్చిన మహిళలను గెంటేశారు. ఈ విషయం తెలుసుకున్న కొంగరకలాన్‌కు చెందిన అనేకమంది రైతులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో వారిని కూడా పోలీసులు అక్కడి నుంచి లాక్కెల్లారు. శ్రీనివాస్ అనే రైతు వెంటనే సర్వే పనులను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు వెంటనే పెట్రోల్ డబ్బాను స్వాధీనం చేసుకుని అతడిని కూడా ఠాణాకు తరలించారు. ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి కొంగరకలాన్, పంజాగూడ, తిమ్మాపూర్, తుర్కగూడ మీదుగా ఫోర్త్‌సిటీ వరకు రోడ్డు వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రోడ్డు కోసం కొంగరకలాన్‌లో 90 ఎకరాలు, పంజాగూడలో 15 ఎకరాల పట్టా భూములను సేకరించనున్నది.
కొంగరకలాన్ ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 300 ఫీట్ల రోడ్డు వేసే గ్రామాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. బయట వారు గ్రామాల్లోకి రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. రోడ్డు సర్వేకు వచ్చిన అధికారులను కొంగరకలాన్, కందుకూరు మండలంలో రైతులు అడ్డుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలను రప్పించారు. కొంగరకలాన్, పంజాగూడ, కందుకూరు, తుర్కగూడ తదితర గ్రామాల్లో పోలీసులను మోహరించి వారి నిఘాలో సర్వే పనులను చేపడుతున్నారు.
ప్రాణాలైనా ఇస్తాం.. కానీ, భూములిచ్చే ప్రసక్తే లేదని కొంగరకలాన్‌కు చెందిన పలువురు రైతులు స్పష్టం చేశారు. తమకు తెలియకుండానే భూముల్లో సర్వే చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాతల కాలం నుంచి భూమిని నమ్ముకునే జీవిస్తున్నామని.. అది లేకుంటే తమకు జీవితమే లేదని స్పష్టం చేస్తున్నారు. పొలాలను తీసుకుని తమను రోడ్డుపాలు చేయొద్దని అధికారులు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. భూములను తీసుకుంటే వేరే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని, లేనిపక్షంలో తాము ఇక్కడే చనిపోతామని అధికారుల ఎదుట బైఠాయించారు.
మాకున్న రెండెకరాల భూమి ఫోర్త్‌సిటీ రోడ్డు కోసం పోతుంది. ఆ భూమిని నమ్ముకొనే జీవిస్తున్నాం. ఆ పొలం పోతే మా బతుకు శూన్యమే. ప్రభుత్వం మా భూములను బలవంతంగా తీసుకోవాలని చూడడం తగదు.
నాకు 2 ఎకరాల 8 గుంటల భూమి ఉన్నది. భూమి మధ్యలో నుంచి ఫోర్ట్సిటీ రోడ్డు పోతున్నది. పొలానికి వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. నేను, నా పిల్లలు ఎట్లా బతకాలి. మా భూమిలో గుర్తులు పెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే ఇంత మోసమా..? మా భూమిని తీసుకునే ముందు ప్రభుత్వం ఆలోచించాలి. రైతుల గోడు వినాలి.
మా భూములను సీఎం ఇష్టానుసారంగా లాక్కోవడం ఏమిటి? ఆయన ఆయ్యా జాగీరా..? మాకు తెలియకుండా భూముల్లో సర్వే చేయడానికి ప్రభుత్వానికి ఏమి హక్కు ఉన్నది. ఫోర్త్‌సిటీ వద్దే..వద్దు.. భూములే మాకు కావాలి. సర్వేకు అధికారులు వస్తే అడ్డుకుంటూనే ఉంటాం.
కాయకష్టం చేసుకుని జీవిస్తున్నాం. రోడ్డు కోసం నా పొలాన్ని ఎందుకు గుంజుకుంటరు. మేము ఎట్లా బతకాలి. ఇతరుల ప్రయోజనాల కోసం నా భూమిని ఇయ్య. మా భూమిని గుంజుకోవద్దు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి.
మా భూముల నుంచి ఫోర్త్‌సిటీ రోడ్డును ఎట్టి పరిస్థితులోనూ వేయనీయం. భూ ములకు ప్రత్యామ్నాయంగా భూములిస్తేనే రోడ్డును వేయనిస్తాం. బలవంతంగా రోడ్డువేస్తే ప్రాణాలైనా ఇస్తాం.. కానీ, పనులను అడ్డుకుంటాం. ఫోర్త్‌సిటీ ఏర్పాటు చేయాలని మేము కోరామా..? మాకు ఫోర్త్‌సిటీ వద్దు.. ఏమి వద్దు.
అప్పులు చేసి 10 నెలల కిందట పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నా. మరో ఎకరన్నరలో పూలతోట వేశా. ఈ మొత్తం భూమి కూడా ప్రభుత్వం ఫోర్త్‌సిటీ కోసం ప్రతిపాదించిన స్థలంలోనే ఉన్నది. ఉన్న భూమి పోతే అప్పులకు వడ్డీలు కట్టడం గగనమే అవుతుంది. చావే శరణ్యమవుతుంది. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం మా పొలాల నుంచి రోడ్డును వేయడం తగదు. ప్రభుత్వం పునరాలోచించాలి.
చస్తే కూడా బొందపెట్టేందుకు స్థలం లేకుండా చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి న్యాయమా..? అధికారులు మా గోడు వినాలి. పొలాలు పోయిన తర్వాత మా ప్రాణాలు ఉంటే ఎంది.. పోతే ఎంది.. సమాచారం ఇవ్వకుండా భూముల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. ఫోర్త్‌సిటీకి 330 ఫీట్ల రోడ్డు అవసరమా? భూమి పోతే ఎట్లా బతకాలి. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో నుంచి రోడ్డు వేయాలి. పట్టా భూములను ఎందుకు తీసుకుంటున్నారు.
కాయకష్టం చేసుకుని జీవిస్తున్నాం. రోడ్డు కోసం నా పొలాన్ని ఎందుకు గుంజుకుంటరు? మేము ఎట్ల బతకాలె? ఇతరుల కోసం నా భూమిని ఎందుకిస్త?. సర్కారు నా భూమిని గుంజుకుంటనంటే ఊరుకోం.
సర్వే నిర్వహిస్తున్న గ్రామాలకు ఇతరులు వెళ్లకుండా కందుకూరు మండలంలోని తుర్కగూడ వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు