నకిరేకల్, మే 24: ‘ఏమనుకుంటున్నరు మీరు.. సూర్యాపేట రాని.. మావాళ్లతో కొట్టిస్తం.. ఉద్యోగం ఎట్ల చేస్తరో చూస్తం.. సస్పెండ్ చేయిస్తం..’.. ఇదేదో పగ, ప్రతీకారాలతో చెలరేగిపోయి ఒకరినొకరు అనుకున్న మాటలు కాదు.. తమ చుట్టం కోసం బస్సు ఆపలేదన్న కారణంతో డ్రైవర్, కండక్టర్లపై నలుగురు మహిళలు ఇలా విరుచుకుపడ్డారు. దాదాపు కొంత సమయం పాటు రాద్ధాంతం కావడంతో పంచాయితీ కాస్తా పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇటు పోలీసులు, అటు ఆర్టీసీ అధికారులకు తలపోటు తెప్పించిన ఈ వ్యవహారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో శుక్రవారం జరిగింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ నుంచి సూర్యాపేటకు బయల్దేరి నకిరేకల్‌లో ఆగింది. బస్సులో దాదాపు 110 మంది ప్రయాణికులున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న నలుగురిలో ఓ మహిళ నకిరేకల్‌లో తన బంధువు వస్తుందని, కాసేపు ఆగాలని డ్రైవర్‌ను కోరింది. అప్పటికే ఐదు నిమిషాలు ఆపిన డ్రైవర్, తోటి ప్రయాణికుల గొడవతో చేసేదేంలేక బస్సును కొంతదూరం పోనిచ్చాడు. ఇలా చేయడమే పొరపాటైంది. ఒక్కసారిగా నలుగురు మహిళలు లేచి డ్రైవర్‌ను బూతులు తిట్టారు.
సూర్యాపేటలో తమ వాళ్లతో కొట్టిస్తామని, ఉద్యోగం ఎట్లా చేస్తారో చూస్తామని, సస్పెండ్ చేయిస్తామని శివాలూగారు. అప్పటిదాకా ఓపిక పట్టిన డ్రైవర్, వాళ్లు తిడుతుండడంతో బస్టాండ్ నుంచి యూటర్న్ తీసుకొని అర కిలోమీటరు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు బస్సును తీసుకొచ్చాడు. తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని నలుగురు మహిళలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ వచ్చి వారిని స్టేషన్‌కు రమ్మని కోరినా ఆ మహిళలు అస్సలు పట్టించుకోకుండా వారితోనూ గొడవకు దిగారు. బస్సులో ఉన్న వాళ్లు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఓ సందర్భంలో ప్రయాణికులను వేరే బస్సులో ఎక్కించేందుకు ప్రయత్నించారు. చివరికి కండక్టర్ నల్లగొండ డీఎం రామ్మోహన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మిగతా ప్రయాణికులతో సాక్షి సంతకాలు తీసుకొని ఫిర్యాదు చేసి సూర్యాపేటకు బస్సును తీసుకెళ్లండని డీఎం చెప్పడంతో చేసేదేంలేక వెనుదిరిగారు.