Road accident : ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి వంతెన పైనుంచి పడిన ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు. మహారాష్ట్ర (Maharastra) లోని దేవాడ-సోండో సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాకు చెందిన నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు.
స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జాకీర్ కుటుంబం కారులో వైద్యం కోసం నాగ్‌పుర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. కారులో నిజాముద్దీన్ కుటుంబంతోపాటు బంధువులు కూడా ఉన్నారు. ఆస్పత్రిలో పని పూర్తయిన అనంతరం వారు తిరుగ ప్రయాణం అయ్యారు.
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడింది. దాంతో జాకీర్ భార్య సల్మా బేగం, కుమార్తె శబ్రీమ్తోపాటు బంధువులు ఆఫ్జా బేగం, సహారా మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చంద్రపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.