సిటీబ్యూరో, డిసెంబరు 11 (నమస్తే తెలంగాణ): అమీర్‌పేటలోని బాయ్స్ హాస్టల్లో బస చేస్తూ డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను మంగళవారం ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్వీబీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన శ్రీజిత్, ఆదర్శ్, తెలంగాణకు చెందిన డప్పుల అజయ్, కేరళకు చెందిన సంజయ్ అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్‌లోని సతీష్ బాయ్స్ హాస్టల్లో ఉంటూ నగరంలోని ఐటీ కంపెనీలలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన ఈ నలుగురు వచ్చే జీతాలు సరిపోకపోవడంతో డ్రగ్స్ అమ్మడం ప్రారంభించారు. సంజయ్, డప్పుల అజయ్ బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకుని మంగళవారం రాత్రి నగరానికి చేరుకోగా ఎస్టీఎఫ్-బీ బృందం సీఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజు అజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఆర్ నగర్‌లోని హాస్టల్‌పై దాడులు జరిపి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.25 లక్షల విలువ చేసే డ్రగ్స్‌తో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, వినియోగించిన మరో 15 మంది ఐటీ ఉద్యోగులను గుర్తించినట్లు ఎస్ఐ బాలరాజ్ వెల్లడించారు.