ఇందల్వాయి, అక్టోబర్ 14: ఇందల్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో 44వ జాతీయ రహదారి నెత్తురోడింది. శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులందరూ యూపీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇందల్వాయి మండలం దగ్గి వైపు నుంచి డిచ్పల్లికి వస్తున్న వరికోత మిషన్ బ్రేక్‌డౌన్ అయి చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న ఓ బస్సు వరికోత మిషన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్నవారికి గాయాలయ్యాయి. వెంటనే ఏం జరిగిందో చూడటానికి బస్సులో నుంచి ఎనిమిది మంది కిందికి దిగారు. అప్పుడే వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వీరిలో నలుగురిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హైవే అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులందరూ ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాకు చెందిన గణేశ్ (29), దుర్గేష్ ప్రసాద్ (16), గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన ప్రదీప్ (40), సిద్ధార్థ నగర్‌కు చెందిన జిత్తు (32) వలస కూలీలని గుర్తించారు. దసరా పండుగ కోసం హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రదీప్ సోదరుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇందల్వాయి ఎస్సై మహేశ్ తెలిపారు. డీసీఎం డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.