హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): అఖిల భారతీయ సాంకేతిక మండలి (ఏఐసీటీఈ) అనుమతుల్లేవ్.. జేఏన్టీయూ నుంచి అనుమతి తీసుకోలేదు.. కానీ రాష్ట్రంలో నాలుగు ఇంజినీరింగ్ కాలేజీలు వెలిశాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలుచేస్తూ క్లాసులు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని చెబుతున్నాయి. వీటిలో చేరిన విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభంకాకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు లీప్‌స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్‌వేవ్ సహా మరో రెండు సంస్థలపై విద్యార్థి సంఘాలు ఇటీవలే తెలంగాణ ఉన్నత విద్యామండలికి ఫిర్యాదుచేశాయి. లీప్‌స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఓ సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నడుస్తున్నది. వాస్తవానికి ఇలా కాలేజీ/స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని పేరు పెట్టుకోరాదు. ఇక నెక్స్‌వేవ్ అనే సంస్థ ఏకంగా నానక్‌రామ్‌గూడలో క్యాంపస్ తెరిచింది. ఈ సంస్థ ఇప్పటికే వందల మంది విద్యార్థులను చేర్చుకున్నట్టు కొందరు ఫిర్యాదు చేశారు. మరో రెండు ఫేక్ కాలేజీలు సైతం విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయంపై లీప్‌స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్‌వేవ్ సంస్థ స్పందన కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా స్పందించలేదు.
ఈ సదరు సంస్థలు కొన్ని డీమ్డ్ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ ఒప్పందంలో భాగంగా ఆఫ్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో తెరిచినట్టు ప్రచారం. కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్ఈ), సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి ఆఫ్ క్యాంపస్‌లను తెరవాలన్నా అన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సిందే. కానీ ఈ నాలుగు సంస్థలు అనుమతులేవి తీసుకోలేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. పైగా క్లాసులు హైదరాబాద్‌లోనే జరుగుతాయని తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఈ నాలుగు కాలేజీలపై ఫిర్యాదులందడంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆరా తీస్తున్నది.