CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ 1న మూసీ పనులకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిచేశామని రుణమాఫీ కింద దాదాపు రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. సాంకేతిక కారణాలతో కొన్ని ఆగిపోయి ఉండొచ్చని, వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పూర్తయినట్టు తెలిపారు. కొరియా పర్యటనకు వెళ్లి వచ్చిన జర్నలిస్టులతో మంగళవారం సచివాలయంలో రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నా మూసీ విషయంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమని, మూసీ కోసం భూములిచ్చే వారికి వందశాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తామని వివరించారు. బాపూ ఘాట్ నుంచే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
రూపాయి కూడా ఖర్చు చేయం
మూసీ అభివృద్ధి అధ్యయనానికి నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సియోల్‌కు పంపుతామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపినట్టు తెలిపారు. ఈ చర్చ కారణంగానే మూసీపై ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. మూసీ ప్రాజెక్టు ద్వారా పర్యాటకం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తొలి దశలో బాపూ ఘాట్ నుంచి గండిపేట, హిమాయత్‌సాగర్ వరకు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయని చెప్పారు. మల్లన్నసాగర్ నుంచి రూ. 7 వేల కోట్లతో నీటిని ఉస్మాన్‌సాగర్‌కు మళ్లిస్తామని, అక్కడి నుంచి హిమాయత్‌సాగర్‌కు పంపుతామని తెలిపారు.
ట్రంక్‌లైన్ కోసం వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. ప్రతిపక్షాలు రూ.1.5 లక్షల కోట్లు అని విమర్శలు చేస్తున్నాయి కానీ, ప్రభుత్వ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయబోమని, పూర్తి నిధులను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం నుంచే సేకరిస్తామని చెప్పారు. బాపూ ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అక్కడే బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణం చేపడతామని, ఇందుకోసం ఆర్మీ భూమిని కూడా అడిగినట్టు తెలిపారు.15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామని, మూసీ వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రిక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు.
మూసీని మరొక సిటీగా అభివృద్ధి చేస్తామని, రూ. 141కోట్లతో డీపీఆర్ తయారీకి కన్సెల్టెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. మూడు నెలల్లోనే నివేదిక వస్తుందని తెలిపారు. మూసీని ఎకో ఫ్రెండ్లీ, వెజిటేరియన్ కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేస్తామని వివరించారు. మూసీ వెంట రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మార్కెట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. మూసీకి ఎలాంటి ఫైనాన్షియల్ మోడల్ వాడాలో డీపీఆర్‌లో తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేటీఆర్ నుంచి సలహాలు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావు తమ ప్రతిపాదనలు తెలపాలని కోరారు. సమయం వచ్చినప్పుడు మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తానని, అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని తెలిపారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందనడం సరికాదని, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత వచ్చిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.