హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తేతెలంగాణ): గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఫార్ములా 1ఈ రేస్ ఒప్పందంలో తప్పేమీ కనబడటం లేదని బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఒక విదేశీ సంస్థతో నాలుగేండ్లకు ఒప్పందం చేసుకొని చట్టబద్ధంగా నగదు బదిలీ చేసిందని శనివారం ఆమె ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. పైగా సదరు సంస్థ ఇప్పటికీ ఒప్పందం ప్రకారం 2024, 2025లో కూడా ఈవెంట్స్ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ముందుకొస్తున్నదని తెలిపారు. ఈ ఒప్పందంలో ఏమైనా పొరపాటు జరిగితే సివిల్ వివాదం కిందికి వస్తుందే తప్ప క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు.