చండూరు: నల్లగొండ జిల్లా చండూరులో (Chandur) పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏ కారణం చెప్పకుండానే దళిత నేత, మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు అన్నెపర్తి శేఖర్ అన్నెపర్తి శేఖర్‌ను అరెస్టుచేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి చొరబడిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకెళ్లారు. కుటుంబీకులను భయభ్రాంతులకు గురిచేసిన పోలీసులు.. ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్టు చేశారనే విషయాలు చెప్పకుండానే తీసుకెళ్లారు. దీంతో వారు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన లేకపోవడంతో ఎక్కడికి తీసుకెళ్లారంటూ రోదిస్తున్నారు. శేఖర్ ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే శేఖర్ అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు చెప్పడం గమనార్హం.
రాత్రి 2 గంటలకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను కిడ్నాప్ చేశారని అన్నెపర్తి శేఖర్ సతీమణి అన్నారు. ఎవరు మీరని ప్రశ్నించినప్పటికీ వారు సమాధానం ఇవ్వలేదని చెప్పారు. తన భర్తను కారులోకి ఎక్కించిన తర్వాత తాము పోలీసులమని చెప్పారని వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకడని అరెస్టు చేశారా లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత అని అక్రమంగా తీసుకెళ్లారా అని ప్రశ్నించారు. ఆయన ఏం నేరం చేసిండో చెప్పాలన్నారు.
కాగా, అన్నెపర్తి శేఖర్ అరెస్టుపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని చీటింగ్ చేయడం, బాధితుడిపై దాడి ఘటనలో అరెస్ట్ చేశామని చండూరు పోలీసులు వెల్లడించారు. బాధితుడి పిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశామన్నారు.