హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తేతెలంగాణ): ‘మహిళలంటే రేవంత్ సర్కారుకు ఏమాత్రం గౌరవం లేదు.. ఇటీవల లగచర్లలో గిరిజన మహిళా రైతులు, మొన్న ఆశ కార్యకర్తలపై భౌతికదాడులే ఇందుకు నిదర్శనం’ అని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ కార్యకర్తలపై పోలీసులతో దాడి చేయించిందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.
హామీలను నెరవేర్చాలని కోఠిలోని మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసు ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశ కార్యకర్తలపై పోలీసుల దమనకాండ దుర్మార్గమని పేర్కొన్నారు. ఘటనపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
మహిళా నాయకురాలు సుమిత్ర ఆనంద్ తనోభా మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం మహిళలపై మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నదని ఆరోపించారు. పోలీసుల దాడిలో గాయపడ్డ ఆశ కార్యకర్తలను సకాలంలో దవాఖానకు తరలించకపోవటం దుర్మార్గమని మండిపడ్డారు. ఆశ కార్యకర్తలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సుశీలారెడ్డి, అర్పితా ప్రకాశ్, కీర్తిలతాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.