హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్, ఆధారాల ధ్వంసం కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆమెరికా నుంచి స్పందించినట్టు తెలిసింది. ఒక పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. క్యాన్సర్ చికిత్స కోసం ఆమెరికాకు వెళ్లానని, చికిత్స తర్వాత జూన్, జూలైలో హైదరాబాద్‌కు వస్తానని చెప్పినట్టు తెలిసింది. ‘మాకు అప్పటి ప్రభుత్వం ఏం చెబితే ఉద్యోగిగా ఆ పనిచేశాం. ఇప్పుడు మిమ్మల్ని పని చేయించినట్టే మమ్మల్ని కూడా పని చేయించారు. పోలీసు వృత్తిలో ఇది ఒక భాగం. మా ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరమేమొచ్చింది. మనం మనం పోలీసులం’ అని ప్రభాకర్‌రావు మాట్లాడటంతో సదరు అధికారి, మీరు ఏమి చెప్పాలనుకున్నా ఈ మెయిల్ ద్వారా అధికారికంగా పంపించాలని సూచించి ఫోన్ కట్ చేశారని తెలిసింది.
కస్టడీ పిటిషన్‌పై వాదనలు
ప్రణీత్‌రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎస్ఐబీ మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేయడంతో న్యాయస్థానం వాళ్లిద్దరికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ ముగ్గురు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇద్దరు ఏఎస్పీలను కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కోర్టును ఆశ్రయించడంతో మంగళవారం ఈ పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశాలున్నాయి. మావోయిస్టులు, టెర్రరిస్టులు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించే వారి ఫోన్ నంబర్లను అధికారికంగా దేశంతోపాటు ఆయా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటాయి. దీనిని ఆసరగా చేసుకొని ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు పనిచేశారని విచారణలో విచారణలో తేలింది. ఎస్ఐబీలో ఎప్పటి నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారు? నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న సాప్ట్వేర్లు ఏమిటి? అనే అంశాలపై ప్రణీత్‌రావును ప్రత్యేక బృందం ప్రశ్నించినట్టు తెలిసింది.
మూసీ నుంచి హార్డ్‌డిస్క్ శకలాలు స్వాధీనం!
భుజంగరావు, తిరుపతన్నలు ప్రణీత్‌రావుపై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు వ్యాపారులు, అక్రమ దందాలు చేసేవారి నంబర్లను ట్యాప్ చేసి అక్రమ సంపాదనకు కూడా తెరలేపినట్టు విచారణలో బయటపడింది. అక్రమ సంపాదనతో కొన్న ఆస్తులు బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించినట్టు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. చాదర్‌ఘాట్ వద్ద మూసీలో పడవేసిన హార్డ్‌డిస్కుల శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా, ఎస్ఐబీలో పనిచేసే కొందరు అధికారులు ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, అలా చేయడం నేరమంటూ వారించడంతో తమను ఇతర విభాగాలకు బదిలీ చేశారంటూ కొందరు అధికారులు చర్చించకుంటున్నారు. అలాంటి వారిని కూడా ప్రస్తుతం దర్యాప్తు అధికారులు ఆరా తీసి, ఈ కేసులో సాక్షలుగా చేర్చే అవకాశాలున్నాయి.
టెక్నికల్ కన్సల్టెంట్..!
ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా పనిచేసిన రవి అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ డివైస్, సాప్ట్వేర్లు తెప్పించారని విచారణలో బయటకు వచ్చింది. ఈ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి విపక్షాలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని చర్చ జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ చేయలంటే తప్పని సరిగా ఆయా సెల్‌ఫోన్ ప్రొవైడర్ల అనుమతి తప్పనిసరి. కానీ, నిబంధనలు ఉల్లంఘించి సాఫ్ట్వేర్లతో ఫోన్లను హ్యాక్ చేయడం చట్టపరిధిని దాటి చేయడమేనని కొందరు అధికారులు తెలిపారు. ఈ కేసులో టెక్నికల్ కన్సల్టెంట్‌ను పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇతడిచ్చే సమాచారంతో ఫోన్ హ్యాకింగ్ సాప్ట్‌వేర్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అసలు ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన సాప్ట్వేర్ ఏంటి అనే సమాచారాన్ని పోలీసులు తెలుసుకోనున్నారు.