హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ)/రామంతాపూర్: ఐకమత్యంతో పోరా డి బీసీలు రాజకీయాల్లో తమ వాటాను సాధించుకోవాలని తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ చైతన్యం మొదలైందని, బీసీలంతా సంఘటితమవుతున్నారని చెప్పా రు.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లోని విశ్వకర్మ ఆత్మగౌరవ భవన ప్రాంగణంలో ఆదివారం జరిగిన విశ్వకర్మల భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం విశ్వకర్మల కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించిందని, విశ్వకర్మల కోసం అనేక పథకాలను తెచ్చిందని తెలిపారు. బీసీ వర్గాల నుంచి వచ్చిన తనను తొలి స్పీకర్గా చేసి తెలంగాణ చరిత్రలో చెరిగిపోని స్థానాన్ని కల్పించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో బీసీలు తమ వాటాను సాధించుకునే దాకా ఉద్యమించక తప్పదని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సూచించారు. అనంతరం విశ్వకర్మ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం ఏర్పాటుచేశారు. ఈ సభలో ఎంపీ ఈటల రాజేందర్, హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, పద్మశ్రీ అవార్డు గ్రహీత వేలు ఆనందాచారి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర, బీజేపీ నాయకుడు ఆచారి, విశ్వకర్మ ఆత్మగౌరవ భావన ట్రస్ట్ చైర్మన్ లాలోట వెంకటాచారి, సెక్రటరీ సుందర్ తదితరులు పాల్గొన్నారు.