న్యూఢిల్లీ, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీజేపీకి సంకట పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి నాయకుల చేరికలు ఆగిపోయాయని వెల్లడించారు. ప్రజలకు నమ్మకం కుదరాలంటే పార్టీ మరింత శ్రమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన ఢిల్లీలో ఒక మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ లాంటి శక్తిని ఎదుర్కోవాలంటే బీజేపీ వ్యవహారశైలిలో అనేక మార్పులు జరగాలని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌తోపాటు భావసారూప్యత గల నాయకులంతా కలిసి మరో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తారనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశమే లేదని అన్నారు. కేసీఆర్‌కు బీజేపీ, కాంగ్రెస్ కంటే కొత్తగా వచ్చే రాజకీయ పార్టీయే ప్రథమ శత్రువు అని పేరొన్నారు.