నల్లగొండ ప్రతినిధి, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు శనివారం పంపారు. నల్లగొండ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని చిన్నపరెడ్డి ఆశించారు. కేసీఆర్ అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మరో సీనియర్ నేత కంచర్ల కృష్ణారెడ్డిని శనివారం అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో చిన్నపరెడ్డి వెంటనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, చిన్నపరెడ్డి టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించగా మొదటిసారి ఓడిపోయారు. తర్వాత 2019లో జరిగిన ఉప ఎన్నికలో అదే స్థానం నుంచి మరోసారి బీఆర్ఎస్ అవకాశం కల్పించగా ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆయన ఇటీవల బీజేపీ నల్లగొండ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి విఫలమైనట్టు ప్రచారం జరిగింది.