హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అక్రమ కేసుల్లో ఇరికించి ఆయన ప్రతిష్టను మసకబర్చాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కేటీఆర్ కృషి వల్లే తెలంగాణకు ఈ- కార్ రేస్ వచ్చిన విషయం ప్రపంచానికి తెలుసని, దాన్ని కొనసాగించకుండా కేసులు పెట్టాలనే కుట్రలో భాగంగానే ఏసీబీ, ఈడీ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో గురువారం బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్‌ను ఈడీ విచారిస్తున్న సందర్భంలో మంత్రులే విచారణ చేస్తున్నట్టుగా కనిపించిందని, అరెస్టు చేయాలని మంత్రులే కోరడం, ఈడీని ఆదేశించేలా మాట్లాడటం దేనికి సంకేతమని నిలదీశారు. కొన్ని మీడియా చానళ్లు వారే ప్రాసిక్యూషన్ చేస్తున్నట్టుగా, విచారణలో భాగమైనట్టుగా వ్యవహరించాయని, సమాజాన్ని పకదారి పట్టించే కుట్రకు తెరలేపాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈడీ విచారణ చాలా కాన్ఫిడెన్షియల్‌గా కొంతమంది అధికారుల మధ్య జరుగుతుందని, కానీ, తాము అక్కడే ఉన్నట్టుగా ప్రశ్నలవర్షం కురిపించినట్టు, ఆ విచారణ వీరికి తెలిసినట్టుగా కొన్ని చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని మండిపడ్డారు. ప్రజలను గందరగోళ పరిచే వార్తలు సృష్టించ డం దురదృష్టకమన్నారు. బీఆర్ఎస్ నేతల పై అకారణంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకొని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా దాడుల సంస్కృతిని కాంగ్రెస్ సర్కారు తెరపైకి తెచ్చిందని దేవీప్రసాద్, తుల ఉమ మండిపడ్డారు.