హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సోమవారం సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశం అయ్యారు. జిల్లాలోని పెండిగ్ ప్రాజెక్టులపై సమీక్షించారు. అనంతరం వంశీచంద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పాలమూరు జిల్లాలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో సాగునీరు అందించేందుకు 2014లోనే జీవో 69 తెచ్చారని తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుదలతో నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధించామని చెప్పారు. పదేండ్లుగా దానికి సంబంధించిన పనులు జరగలేదని విమర్శించారు. త్వరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని వెల్లడించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు సామర్థ్యం మరో రెండు టీఎంసీలు పెంచాలని మంత్రిని కోరినట్టు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, చిట్టెం పర్ణికరెడ్డి తదితరులు పాల్గొన్నారు.