మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 14 : పదేండ్లుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం అనంతారంలో శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న గుడి స్థలం విషయంలో వివాదం నెలకొన్నది. ప్రతి ఏడాది మాదిరిగా సేవాలాల్‌కు భోగ్ భండారో జరుపుకునేందుకు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఆయన సతీమణి సీతామహాలక్ష్మి సేవాలాల్ గుడి వద్దకు వచ్చారు. శంకర్‌నాయక్‌ను లోపలికి వెళ్లకుండా పోలీసులు గేటు వద్దనే ఆపారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. లా అండ్ ఆర్డర్‌కు ఇబ్బంది లేకుండా కలెక్టర్ అనుమతి ఇచ్చాడని చెప్పినా శంకర్ నాయక్, అతడి కుటుంబసభ్యులను లోపలికి పంపించలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పాడని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మండిపడ్డారు.