ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ఆయన ఇంట్లో ఎలాంటి శుభకార్యం లేదు గానీ.. ఇంటి ఎదుట బ్యాండ్ బాజా మోగుతోంది. కొత్తకారు రెడీగా ఉంది. ఆయన కూతురు స్కూల్ డ్రెస్‌లో బ్యాగు వేసుకుని వచ్చి కారెక్కగానే బ్యాండ్ మోగింది. చుట్టుపక్కల వారంతా వింతగా చూశారు.
వివరాల్లోకెళితే, హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి ఓ కూతురుంది. ఆమె పేరు జనశ్రీ. చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నది. అయితే, జన శ్రీ కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి స్కూల్‌కు వెళ్లలేదు. ఇంట్లో ఉంటూనే 6,7వ తరగతి కంప్లీట్ చేసి.. ఇప్పుడు 8వ తరగతిలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గడంతో స్కూల్స్ అన్నీ రీ ఓపెన్ అయ్యాయి.
రెండేళ్లుగా స్కూల్‌కు వెళ్లే అలవాటు తప్పడంతో జనశ్రీ ఇబ్బంది పడడం మొదలుపెట్టింది. దీంతో విష్ణువర్ధన్‌రెడ్డి. ఎక్కడ తన కూతురు స్కూల్ వెళ్లనని మారాం చేస్తుందోనని డిఫరెంట్ గా ఆలోచించారు. జన శ్రీని బ్యాండు మేళాల మధ్య కొత్త కారులో స్కూలుకు సాగనంపారు.