చందంపేట, మే 11: దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కామినేని దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. రవీంద్రకుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పలువురు మాజీ మంత్రులు, వివిధ పార్టీల నాయకులు కన్నిలాల్ మృతదేహానికి నివాళులర్పించి రవీంద్రకుమార్‌ను పరామర్శించారు. ఆదివారం వారి స్వగ్రామం శేరిపల్లితండాలో కనీలాల్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పౌరసరఫరా శాఖలో ఉద్యోగం చేసిన కన్నిలాల్ నాయక్ రిటైర్ అయిన తర్వాత నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని శేరిపల్లితండా(రత్యతండా)కు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కనీలాల్కు ఐదుగురు కుమారులు. పెద్ద కుమారుడు రమావత్ రవీంద్రకుమార్ దేవరకొండ ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు సేవలందించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీలాల్ అంత్యక్రియల్లో పాల్గొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, రవీంద్రకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించాలని అనుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున.. కేసీఆర్ దేవరకొండ పర్యటనకు నల్లగొండ కలెక్టర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దయింది.