హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కన్నబిడ్డకు తన కష్టార్జితం నుంచి కానుకగా ఇచ్చిన ఆస్తులు బినామీ ఎట్లవుతాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రశ్నించారు. తనకున్న వ్యవసా యం, వ్యాపారాల నుంచి వచ్చిన సొమ్ముతో కుమార్తె భవానీరెడ్డికి ఆస్తులు కొనుగోలు చేసి ఇవ్వడం కూడా తప్పేనా? అని ‘నమస్తే తెలంగాణ’తో వాపోయారు. తన ఎదుగుదలపై కక్షగట్టిన కొందరు ఆమెను తనకు వ్యతిరేకంగా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామలో, సిద్దిపేట జిల్లా చేర్యాలలో కొనుగోలు చేసిన స్థిరాస్తులను తన బిడ్డ పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్టు చెప్పారు. ఆమె విద్యావంతురాలని.. ఆనాడు ఆస్తుల రిజిస్ట్రేషన్ సందర్భంగా స్వయంగా వచ్చి సంతకాలు చేసిందని వెల్లడించారు. తన బిడ్డపై కావాలనే కొందరు వ్యక్తులు ఒత్తిడి తీసుకొచ్చి.. ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారే ఈ కేసు పెట్టించారని ఆరోపించారు. ఈ చర్యలను తాను క్షమించినా భగవంతుడు వదిలిపెట్టడని వ్యాఖ్యానించారు.
భవానీరెడ్డికి చెందిన రూ.5 కోట్ల ఆస్తులు అటాచ్
ఆదాయపు పన్నుశాఖ బినామీ ఆస్తుల నిషేధ విభాగం (బీపీయూ) మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె పీటీ భవానీరెడ్డి పేరుతో రిజిస్టర్ అయిన సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేసింది. జనగామ, సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతాల్లో ఉన్న ఈ ఆస్తులు భవానీరెడ్డి పేరుతో రిజిస్టర్ అయినట్టు బీపీయూ తేల్చింది. డిసెంబర్ 24, 2025న బీపీయూ ఈ ఆస్తులను తాతాలికంగా అటాచ్ చేయగా తాజా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జనగామ పట్టణంలో 6 ప్లాట్లు (మొత్తం 1,154 చదరపు గజాలు), చేర్యాలలో 2 ఆస్తులు (1,270 చదరపు గజాలు) మొత్తం 2,424 చదరపు గజాల ఆస్తులను ఐటీ అధికారులు జప్తు చేశారు. జనగామలో ఆమెకు సంబంధించిన ఆస్తి డిసెంబర్ 2018లో, చేర్యాలలోని ఆస్తి జనవరి 2020లో కొనుగోలు చేశారని, లావాదేవీలు నగదు రూపంలో జరిగినట్లు బీపీయూ తెలిపింది.