హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డి ఆరు ఫీట్లు ఉన్నడని మూడు ఫీట్లు అని మాట్లాడుతున్నడా? ఆయనదేమైనా అమితాబ్ బచ్చన్ హైటా?’ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారును 30 ఫీట్లు భూమిలోకి దించుతున్నాడనే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, నిన్న తిరుమలగిరి సభలోనూ రేవంత్‌రెడ్డి పాడిందే పాట అన్నట్టుగా అవే అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
నల్లగొండ జిల్లాకు సీఎం వచ్చారు కాబట్టి జగదీశ్‌రెడ్డిని తిట్టారని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, బీఆర్ఎస్ నేతలు కృష్ణారెడ్డి, ధర్మేందర్‌రెడ్డి, కృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని తాము ఎక్కడా చెప్పలేదని, గోదావరి జలాలను విడుదల చేసిన తర్వాతే రావాలని సూచించామని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి మొనగాడు అయితే తమను ఎందుకు హౌస్ అరెస్టులు చేశారని నిలదీశారు. పింఛన్లు కట్ చేస్తాం, ఇందిరమ్మ ఇండ్లు, డ్వాక్రా రుణాలు ఇవ్వము అని భయపెట్టి తుంగతుర్తి మీటింగ్‌కు ప్రజలను తీసుకొచ్చారని విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత ఊర్లో రైతు రుణమాఫీ అయ్యిందో లేదో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
గంజి ఉన్నదో.. బెంజ్ ఉన్నదో నాగారం వచ్చిచూడు
జగదీశ్‌రెడ్డికి గంజి ఉన్నదో.. బెంజ్ ఉన్నదో నాగారం వచ్చి చూడాలని రేవంత్‌రెడ్డికి కిశోర్ హితవుపలికారు. జగదీశ్‌రెడ్డి భూస్వామి కుటుంబంలో జన్మించారని, నాగారం వస్తే ఇప్పటికీ వారి కుటుంబం నివసించిన భవనం ఉన్నదని చెప్పారు. జగదీశ్‌రెడ్డికి ఎలాంటి బెంజ్ కారు లేదని స్పష్టంచేశారు. కానీ, రేవంత్‌రెడ్డి గోడల మీద రాతలు రాసి, గోడలు దూకి ఈ స్థాయికి వచ్చారని ఎద్దేవాచేశారు. క్లబ్బులకు, పబ్బులకు నేనొస్తనా అంటున్న రేవంత్‌రెడ్డి జీవితం.. క్లబ్బులతో, పబ్బులతోనే మొదలైందని దుయ్యబట్టారు. ఆయనకు అనేక క్లబ్బుల్లో సభ్యత్వం ఉన్నదని, జూబ్లీహిల్స్ క్లబ్లో మెంబర్‌గా చేరిన రేవంత్‌రెడ్డి అందరినీ బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు. ‘తుంగతుర్తి నియోజకవర్గంలో మూడు కొత్త మండలాలు ఏర్పడితే రెండు మండలాలకే బిల్డింగులు ఎట్లా మంజూరు చేశావు రేవంత్‌రెడ్డీ?’ అని ప్రశ్నించారు.
సాగర్ నీళ్లు మనకు రాకుండా పోతున్నా నీళ్ల మంత్రి ఉత్తమ్ మాట్లాడటం లేదని విమర్శించారు. దేవాదుల ఎకడ ఉన్నదో తెలియనివాడు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తెస్తానని అంటున్నారని మండిపడ్డారు. ‘మీటింగ్‌లలో ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అనలేదు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే మాత్రం జై తెలంగాణ అన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి’ అని ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ను తిట్టకపోతే ప్రజలు తనను మర్చిపోతారని రేవంత్ అనుకుంటున్నారని విమర్శించారు. అడ్డగోలు హామీలిచ్చి అమలుచేయకుండా ప్రజలను మోసగించిన రేవంత్‌రెడ్డి సర్కార్‌నే ఉరి తీయాలని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి మంచిబుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్టు చెప్పారు.