మంచిర్యాల, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యంగా బలవంతపు ఏకగ్రీవానికి ప్రయత్నించి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పోలీసులు, ఎన్నికల అధికారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నించారు. మొదటివిడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు బుధవారంతో ముగిసింది. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలి. కానీ దండేపల్లి మండలం పాత మామిడిపల్లి సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన గుర్రాల మాధవి సాయంత్రం 4 గంటల తర్వాత హడావుడిగా మేదరిపేటలోని నామినేషన్ కేంద్రానికి వచ్చారు. అప్పటికే అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు విత్‌డ్రా సమయం అయిపోయిందని, తలుపులు మూసేశారని చెప్తున్నా వినిపించుకోకుండా కొందరు కాంగ్రెస్ నాయకులు ఆమెను వెనుక డోర్ నుంచి హాల్లోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడున్న ఎస్సై వారిని లోనికి అనుమతించినట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు.
కాగా, అభ్యర్థి మాధవి వచ్చినప్పటి నుంచి స్థానిక బీఆర్ఎస్ నాయకులు లోపల జరుగుతున్న తతంగాన్ని వీడియో తీశారు. గడువు ముగిసిన తరువాత వెనుక డోర్ నుంచి అభ్యర్థిని లోపలికి ఎందుకు తీసుకెళ్లారంటూ ఎస్సైని, ఎన్నికల అధికారులను నిలదీశారు. మధ్యాహ్నం 3 గంటలలోపు విత్‌డ్రా చేసుకోవాల్సి ఉన్నా సాయంత్రం 4.20 గంటలకు అభ్యర్థిని నామినేషన్ హాల్లోకి ఎందుకు అనుమతించారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయాన్ని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు కలెక్టర్ కుమార్ దీపక్‌తోపాటు రామగుండం పోలీసు కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సదరు అభ్యర్థి మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నదని, వెరిఫికేషన్ కోసం పిలిచామని రిటర్నింగ్ అధికారి చెప్పినట్టు కలెక్టర్.. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఫోన్‌కు మెసేజ్ చేశారు. మెసేజ్ చేసిన 20 నిమిషాలకు కలెక్టర్ మరోసారి దివాకర్‌రావుకు ఫోన్‌చేసి మధ్యాహ్నం 3గంటల తర్వాత అభ్యర్థి నామినేషన్ కేంద్రానికి వచ్చినందున అక్కడ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. కానీ రాత్రి 9 గంటలకు పాత మామిడిపల్లిలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు.
పాత మామిడిపల్లిలో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ జరిగిన హైడ్రామాకు సంబంధించి వీడియోలు బయటికి వచ్చినా అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలికారని ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ.. కలెక్టర్ తనకు మెసేజ్ పెట్టింది.. ఫోన్లో చెప్పిన దానికి పొంతనే లేదని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.