రామన్నపేట, నవంబర్ 6 : రామన్నపేట మండల కేంద్రంలో అదానీ గ్రూప్ నిర్మించాలని చూస్తున్న అంబుజా సిమెంట్ పరిశ్రమ అనుమతులను సీఎం రేవంత్రెడ్డి వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో జిల్లాలో ఆయన చేపట్టనున్న యాత్రను అడ్డుకుంటామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. పరిశ్రమను రద్దు చేసి మండల ప్రజలకు ముఖ్యమంత్రి తన పుట్టినరోజు కానుకను అందించాలని కోరా రు.
బుధవారం ఆయన రామన్నపేటలో మీడియాతో మాట్లాడారు. శుక్రవారం రేవంత్రెడ్డి వలిగొండ మండలం సంగెం వరకు చేపట్టే పాదయాత్ర రామన్నపేట వరకు పొడిగించి ఇక్కడి ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని సానుకూల ప్రకటన చేయాలని సూచించారు. లేనిపక్షంలో పార్టీలకతీతంగా చిట్యా ల, రామన్నపేట మండలాల ప్రజలు, రైతు లు, వృత్తిదారులతో పాదయాత్రగా వెళ్లి ముఖ్యమంత్రిని నిలదీస్తామని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని, ప్రక్షాళన పేరుతో ప్రజాధనాన్ని దోపిడీ చేసే కుట్రను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.
కాలుష్యకారక సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై జిల్లా మంత్రులు, కాంగ్రెస్ నాయకులు నోరుమెదపకపోవడం దారణమని అన్నారు. అధికార పార్టీ నాయకులు ఉద్యమాలు చేయనవసరం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే సరిపోతుందని హితవు పలికారు. పరిశ్రమ ఏర్పాటును ఆపేందుకు చొరవ తీసుకునే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను సన్మానిస్తామని తెలిపారు. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరిస్తే ప్రజలు పారలు, గడ్డపారలతో కదిలివస్తారని.. ఆపై జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.