భీమ్‌గల్, నవంబర్ 12: ‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి మాట ఇచ్చిండు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటింది. ఇప్పటిదాకా ఏ ఒక్కరికీ తులం బంగారం ఇవ్వలేదు. ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఎప్పుడిస్తారు?’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో 224 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి జరిగితే ఆ కుటుంబానికి అండగా ఉండాలని కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, పంటకు రూ.500 బోనస్, రూ.15 వేల రైతుభరోసా ఇస్తామన్న రేవంత్ కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తులం బంగారం, నెలకు రూ.2,500, రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నారా? అని అక్కడున్న మహిళను వేముల ప్రశ్నించగా.. రావట్లేదని వారు బదులిచ్చారు.