హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): కౌలు రైతులకు ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ వారి బతుకులకే భరోసా లేకుండా చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కౌలు రైతు బానోత్ వీరన్న బలవన్మరణమే రేవంత్ సర్కారు మోసానికి నిలువెత్తు నిదర్శనమని సోమవారం ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారి లేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు ఒడిగట్టడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన రైతు వీరన్నది ఆత్మహత్య కాదని. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కౌలు రైతులకు ఆత్మీయ భరోసా కింద ఏటా రూ. 15 వేలు ఇస్తామని బాండ్లు రాసిచ్చిన కాంగ్రెస్ నేతలు గద్దెనెక్కగానే మోసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఇంకెంతమంది రైతులను బలితీసుకుంటరు?
పండించిన పంట కొనే దిక్కులేక, మద్దతు ధర రాక దళారుల దోపిడీకి అన్నదాతలు బలవుతున్నారని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ‘సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ మొండి ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ మేరకు ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తరు? మీ సర్కారు నిర్లక్ష్యానికి ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటరు?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు.
రైతు కుటుంబానికి పరిహారమివ్వాలి
నేడు ఖమ్మం పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి రెడ్డి వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ వెంటపడుతుందని తేల్చిచెప్పారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని గుర్తుంచుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ అధైర్యపడవద్దని హరీశ్‌రావు విజ్ఞప్తిచేశారు.