మక్తల్ టౌన్, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ అంటేనే మోసానికి కేరాఫ్ అని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అమలుకాని 420 హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ దుయ్యబట్టారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి రాగా విదేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం పరువు తీశారని ధ్వజమెత్తారు. దావోస్‌లో బీఆర్ఎస్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను బొందపెట్టడం ఎవరి తరం కాదని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు పార్టీ క్యాడర్ శక్తివంచన లేకుండా కృషిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలకు, నాయకులకు మధ్య సమన్వయ లోపం కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు. సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిన క్రమంలో కార్యకర్తలను పట్టించుకోలేకపోయామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఓటర్ లిస్టులు పట్టుకొని బీఆర్ఎస్ నేతలు తిరుగుతుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం పథకాలు అందని వారి జాబితా పట్టుకొని అసత్య ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజినీ సాయిచంద్, చిట్టెం సుచరితారెడ్డి, దేవరి మల్లప్ప, మాజీ సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.