Gurukula Schools | మహేశ్వరం, బడంగ్‌పేట, సెప్టెంబర్ 5: నిర్వహణ వైఫల్యంతో గురుకులాలన్నీ ఖాళీ అవుతున్నాయి. హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించకపోవటం, నాసిరకం ఆహారం.. తదితర కారణాలతో విద్యార్థులు గురుకులాలకు గుడ్‌బై చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గురుకులాల్లో ఇవే పరిస్థితులు. సర్కారు నిర్వహణ లోపం వల్లే తమ పిల్లల టీసీలు తీసుకెళ్లిపోతున్నామని విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇలాంటి గురుకులంలో ఉండలేమంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్లో ఉన్న కందుకూరు గురుకులానికి చెందిన ఏడుగురు విద్యార్థులు టీసీలు తీసుకెళ్లిపోయారు. దీంతో పరిస్థితులు తెలుసుకొనేందుకు మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి ఆ గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పడుతున్న అవస్థలు చూసి ఆమె చలించిపోయారు. నిర్వహణ సరిగా లేక హాస్టల్ గదులు, క్లాస్ రూమ్‌లు దుర్గంధంతో నిండిపోయాయి. కొంతమంది విద్యార్థులు జ్వరంతో నేలపైనే పడుకోవటం చూసి ఆవేదన చెందారు.
‘ఇదేం హాస్టల్.. గదుల్లో కిటికీలు, తలుపులు, ఫ్యాన్లు సక్రమంగా లేవు.. మరుగుదొడ్ల నుంచి పిల్లల గదుల్లోకి తీవ్ర దుర్గంధం.. వర్షం వస్తే గదుల్లో నీరు.. అక్కడే పిల్లలు ఉండాల్సిన దుస్థితి.. బర్ల దొడ్డికన్నా ఈ హాస్టల్ అధ్వానంగా ఉన్నది’ అని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కందుకూరు గురుకుల హాస్టల్‌ను సందర్శించిన ఆమె.. విద్యార్థుల దుర్భర పరిస్థితిని చూసి చలించిపోయారు. హాస్టల్ అంతా కలియదిరిగి మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకులను పరిశీలించారు. జ్వరంతో బాధపడుతున్న పిల్లలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. 550 మంది విద్యార్థులు చదువుకునే హాస్టల్లో ఇన్ని సమస్యలు ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని పాలకులను ప్రశ్నించారు.
కనీసం తాగడానికి మంచినీళ్లు కూడ లేకపోతే ఎలా? అని నిలదీశారు. విద్యార్థులు చదువుకోవటానికి కనీసం బెంచీలు, టేబుళ్లు లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. హాస్టల్‌ను సందర్శించిన సందర్భంగా సబితకు విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. తరగతి గదుల్లో కూడా దుర్గంధ వాసన వస్తున్నదని, దోమలు విపరీతంగా ఉన్నాయని తెలిపారు. అక్కడికొచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యేలకు తమ పిల్లల ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. వెంటనే ఆమె ఉన్నతాధికారులకు ఫోన్ చేసి అక్కడి సమస్యలను వివరించారు. శుక్రవారమే వచ్చి ఫర్నిచర్ ఇతర సమస్యలను తీరుస్తామని ఎమ్మెల్యేకు అధికారులు తెలిపారు.
బడంగ్‌పేట మున్సిపల్ కమిషనర్ రఘుకుమార్, ఏఈ వినీల్గౌడ్ను రప్పించి అవుట్‌లేట్ ఏర్పాటు చేయడానికి డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేయించాలని ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో చైర్మన్ నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, యాతం పవన్‌కుమార్, సుక్క శివకుమార్, కోఆప్షన్ జగన్మోహన్రెడ్డి, బడంగ్‌పేట బీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, బీమిడి జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాదర్గుల్లో ఉన్న గురుకులంలో 550 మంది విద్యార్థులు ఉన్నారు. జూనియర్ కళాశాల కూడా ఇదే భవనంలో ఉన్నది. సౌకర్యాలు కల్పించటంలో సర్కారు విఫలం కావటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ ముందు ధర్నా చేసినా ఫలితం లేకపోయింది. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితి మారలేదు. వర్షాలతో గదుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతున్నది. కనీస సమస్యలు కూడా పరిష్కరించకపోతే పిల్లలను ఎలా చదివించాలని పేరెంట్స్ కమిటీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నాసిరకం భోజనం పెడుతున్నారని, బాలుర హాస్టల్లో డైనింగ్ లేక పిల్లలు నేలపైనే కూర్చొని తినాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని వెల్లడించారు.