బడంగ్‌పేట, డిసెంబర్ 7: ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉన్నదని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట తాసీల్దార్ కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించిన 113 చెక్కులను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. తాసీల్ధార్ ఇంద్రాదేవి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు తీసుకున్న ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెక్కులు ఇచ్చి చేతులు దులపుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చాలని అన్నారు. ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వమైనా అమలు చేయవలసిందే అన్నారు. మహిళలకు ఉచిత బస్సుతోపాటు రూ.2,500లు ఇస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలు బిందెలు తీసుకొని రోడ్ల మీదకు రావద్దని మిషనర్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. ముందుచూపుతో కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. చాలామంది పేదలు తమ బిడ్డల వివాహాలు చేయలేక పడుతున్న ఇబ్బందులను గమనించిన కేసీఆర్ కల్యాణలక్ష్మి లాంటి పథకాలు తెచ్చారని తెలిపారు. ఆడ బిడ్డలకు మేనమామగా కేసీఆర్ ముందుండి పెండ్లిళ్లు జరిపించారని అన్నారు. మహిళల కోసం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ ఏమైయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రంరెడ్డి, బడంగ్‌పేట కమిషనర్ సరస్వతి, మీర్‌పేట కమిషనర్ ఆర్ జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.