నాగర్‌కర్నూల్, నవంబర్ 3 : పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. పాలమురు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మూడో ప్యాకేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే డిసెంబర్ 7న నిరసన దీక్ష చేపట్టనున్నట్టు హెచ్చరించారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా.. అసమర్థ పాలనతో అభివృద్ధి శూన్యంగా మారిందని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను వివరించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భరోసాయాత్ర చేపడుతానని పేర్కొన్నారు. పాలకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని మంత్రులు చెబితే.. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. పీఆర్ఎల్ఐలో నీట మునిగిన మోటర్లను ఎందుకు పట్టించుకోవడం లేదని.., బురదలో ఇరుక్కున్న మోటర్లను నీటితో కడిగారే తప్పా మరమ్మతులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.