Mahmood Ali | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్తు వ్యవస్థను అదానీకి అప్పగిస్తే ఉరుకునేది లేదని మాజీ మంత్రి మహముద్‌అలీ హెచ్చరించారు. ఒకవైపు అదానీని రాహుల్‌గాంధీ వ్యతిరేకిస్తుంటే.. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఆయనను ఆహ్వానిస్తున్నాడని, దీనిపై జాతీయ కాంగ్రెస్ స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం మహమూద్ అలీ మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలో విద్యుత్తు బిల్లుల వసూలును అదానీ సంస్థకు అప్పజెప్పాలని తీసుకున్న నిర్ణయం మైనార్టీలను అవమానపరచడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మైనార్టీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు ప్రతి ఏటా బడ్జెట్లో రూ.2వేల కోట్లను కేటాయించింది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4 వేల కోట్లు కేటాయిస్తామన్నారని, వచ్చే బడ్జెట్లో కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అనాథల కోసం అనీస్ ఉల్ గర్బాను నిర్మించారని, ఆ భవనాన్ని ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తే ఆనాథల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో మైనార్టీ మంత్రి లేకపోవడం విచారకరమని అంటూ.. కేసీఆర్ మైనార్టీలకు డిప్యూటీ సీఎం, హోం మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదని అన్నారు.
పాతబస్తీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, నిత్యం హత్యలు జరుగుతున్నాయని మహమూద్ అలీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మతకలహాలు కూడా పెరిగిపోయాయని చెప్పారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో శాంతిభద్రతలను పటిష్ఠంగా కాపాడామని, మత ఘర్షణలు జరగకుండా చూశామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీంగా పనిచేస్తున్నదని, అందుకే మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడంలేదని విమర్శించారు.
బీజేపీతో ఉన్న చంద్రబాబుకు కాంగ్రెస్ సీఎం రేవంత్ ఘనస్వాగతం పలకడం ఇందులో భాగమేనని అన్నారు. రాహుల్‌గాంధీ ఢిల్లీలో బీజేపీతో కొట్లాడుతుంటే.. రేవంత్ ఇకడ బీజేపీతో స్నేహం చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓట్లేసినా వారి సంక్షేమం కోసం రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మైనార్టీలకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రేవంత్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.