హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా చివరి వరకు అడ్డుకుంటామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఆ మండలం అంతా నాశనమవుతుందని మండిపడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు.
సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రామన్నపేట మండలంలో మూగజీవాలకు గడ్డి దొరకదని ఆవేదన వ్యక్తంచేశారు. అవసరమైతే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నల్గొండకు మూసీ ద్వారా త్రాగునీరు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎలా కడతారు అని ప్రశ్నించారు. తెలంగాణలో మోడీ, రేవంత్ మిలాఖత్ గురించి స్పష్టమవుతోందని పేర్కొన్నారు.