హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని, పాలనచేతకాని ఈ మరుగుజ్జులు ఆయన దగ్గరకు కూడా చేరలేరని, మాడిమసైపోతారని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 24 గంటల కరెంటు ఇచ్చినందుకు కేసీఆర్‌ను జైల్లో పెడతారా? అని ప్రశ్నించారు. విద్యుత్తు సంఘం నివేదికలో ఏమున్నదని దొంగతనంగా ముందే లీకులు ఇస్తున్నారని నిలదీశారు. విద్యుత్తు సంఘం చైర్మన్ మదన్ బీ లోకూర్ ఎప్పుడు పనిచేశారో తెలియదని, తమ వివరణను చైర్మన్ తీసుకోలేదని, విచారణ చేయకుండా నివేదిక ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కొన్ని మీడియా సంస్థలు తమపై విషం కక్కుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
కమిషన్ విచారణ పూర్తిచేసి నివేదిక ఇచ్చినట్టు ప్రభుత్వంగానీ, ముఖ్యమంత్రిగానీ, సీఎస్‌గానీ ఎక్కడా అధికారంగా చెప్పలేదని అన్నారు. విద్యుత్తు కమిషన్ వేస్తున్నట్టు సీఎం అసెంబ్లీలో ప్రకటించారని, విచారణ పూర్తయితే అసెంబ్లీలోనే వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముందు చిల్లర వేషాలు వేయలేరని విమర్శించారు. ‘దొంగతనంగా లీకులు ఎందుకు ఇస్తున్నారు. మమ్మల్ని జైలులో వేసే ఆలోచన వస్తే ఆలస్యం ఎందుకు.. భయపడుతున్నారా?’ అని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
విద్యుత్తు ఒప్పందాలపై విచారణ సంఘం తొలి చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ఎలాంటి విచారణ జరపకుండానే కేసీఆర్‌పై మీడియా ముఖంగా ఆరోపణలు చేయడంతో తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని గుర్తుచేశారు. జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ధర్మాసనం తీర్పు ఇచ్చిందని, నూతన చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ మదన్ బీ లోకూర్ ఎప్పుడు విచారణ చేశారో కూడా తమకు తెలియదని అన్నారు. కమిషన్ నివేదిక ఇచ్చినట్టు అనుకూల మీడియాకు ప్రభుత్వం లీకులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. విద్యుత్తు సంఘం రిపోర్ట్ ఇస్తే బాజాప్తా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. చిల్లరమల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
ఏం చేశారని ఏడాది సంబురాలు?
కాంగ్రెస్ ఏడాది పాలనపై సంబురాలు జరుపుతామని, వేడుకలకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏం చేశారని ఏడాది సంబురాలు? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి పాలనపై సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ప్రజలని అన్నారు. రాహుల్‌గాంధీకి దమ్ముంటే పోలీసులు లేకుండా అశోక్‌నగర్‌కు, రైతుల వద్దకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఏడాది సంబురాలు జరుపుకొంటారో? ప్రభుత్వానికి ఏడాది తిథి (మాసికం) పెడతారో తెలుస్తుందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలు తిథి పెట్టడానికి రెడీగా ఉన్నారని హెచ్చరించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, చివరికి రక్షణ కల్పించే పోలీసులకు ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కుదేలైందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 4 వేల కోట్లు తగ్గిందని, అవినీతితో కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకొంటున్నారని విమర్శించారు.
పోలీసులను చూసి ప్రభుత్వం భయపడే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఒక వర్గమైనా సంతోషంగా ఉన్నదని చెప్పే ధైర్యం రేవంత్‌కు ఉన్నదా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను కొన్ని మీడియా సంస్థలు చూపించకపోవడంతో రేవంత్‌రెడ్డి తప్పులను ప్రజా గొంతుకగా సోషల్ మీడియా ఎత్తిచూపుతున్నదని పేర్కొన్నారు. వారి గొంతు నొక్కాలని చూస్తున్నారని, అరెస్టులతో ఆందోళనలను ఉద్యమాలను ఆపలేరని తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డికి ‘ముందుంది ముసళ్ల పండగ’ అని హెచ్చరించారు. ధాన్యం ప్రభుత్వానికి ఇస్తే డబ్బులు వస్తాయో రావో అని రైతులు భయపడుతున్నారని అన్నారు. ఢిల్ల్లీకి మూటలు పంపడంలో, ప్రజాధనం దోచుకోవడంలో రేవంత్‌రెడ్డి, మంత్రులు పోటీ పడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్పై ఐఎంఐ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యపై జగదీశ్‌రెడ్డి స్పందించారు. ఒవైసీ గురించి ముస్లింలకు తెలుసని పేర్కొన్నారు. ఆయన గురించి మాట్లాడటం వృథా అని అన్నారు. మూసీ పునరుజ్జీవానికి బీజం వేసిందే బీఆర్ఎస్ అని గుర్తుచేశారు.
రైతులను గాలికొదిలేసి ఇతర రాష్ర్టాల్లో జల్సాలు
ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను గాలికొదిలేసి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎంజాయ్ చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోళ్లపై సమీక్ష చేయని వీరంతా పక రాష్ట్రాల్లో మాత్రం ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేవు. ధాన్యం కొనే దిక్కు లేదు. మిల్లర్లతో చర్చలు జరపలేదు. ఏ కేంద్రంలో కొన్న వడ్లు ఏ మిల్లుకు వెళ్లాలో నిర్ణయించలేదు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి కల్లాల్లో రైతులు కన్నీళ్లు పెట్టకుంటున్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నరు. పత్తి రైతులకు కాంగ్రెస్, బీజేపీ ద్రోహం చేశాయి. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిందే గ్రామీణ ప్రాంతాలు. 2014కు ముందున్న పరిస్థితులు తెలంగాణలో దాపురించాయి. మోదీని రేవంత్‌రెడ్డి తిట్టినా బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారు. రేవంత్‌రెడ్డిని విమర్శించే మొగోడు బీజేపీలో లేడు. రెండు పార్టీల నేతలు అంతగా హత్తుకుపోయారు’ అని మండిపడ్డారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లను త్వరితగతిన కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.