Jagadish Reddy | హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): బొగ్గు గనుల వేలం వెనుక మరొక అదృశ్యశక్తి ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెర వెనక ఉన్న ఆ అదృశ్యశక్తి ఎవరో బహిర్గతం కావాలని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని బొగ్గు గనుల వేలం కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. బొగ్గు గనుల వేలం నుంచి శ్రావణపల్లి బ్లాక్‌ను ఉంచారా? తీసి వేశారా? స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. శ్రావణపల్లి బ్లాక్‌ను వేలం నుంచి తీసేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నదని చెప్పారు. శ్రావణపల్లి బ్లాక్‌ను సింగరేణికి కేటాయించకుంటే ప్రత్యక్ష ఉద్యమాలకు దిగుతామని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బొగ్గు గనుల వేలానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్మీట్లో పాల్గొనడాన్ని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఏ మార్పు వచ్చిందని భట్టి విక్రమార్క ఆ ప్రెస్మీట్లో పాల్గొన్నారని ప్రశ్నించారు. సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం కేంద్రంతో యుద్ధం చేస్తామన్న భట్టి విక్రమార్క, వేలం పాటలకు వెళ్లి అక్కడ కిషన్‌రెడ్డి ఇచ్చిన బొకేతో యుద్ధం చేస్తారా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్సే రక్షణ కవచం
బొగ్గు గనుల వేలం ఎపిసోడ్ ద్వారా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే రక్షణ కవచం అనే విషయం మరోసారి నిరూపితమైందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హకులను ఇతరులకు ధారాదత్తం చేస్తున్నప్పుడల్లా బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నదని వివరించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా పదేండ్లు కేసీఆర్ అడ్డుపడ్డారని, అసెంబ్లీలో, బయట బీఆర్ఎస్ చేసిన పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచిందని చెప్పారు. గోదావరి, కావేరి అనుసంధానంపై కూడా కేసీఆర్ తిరగబడ్డారని తెలిపారు. ఇప్పుడు సింగరేణి బ్లాక్‌ల వేలంపై కేటీఆర్ ప్రశ్నించిన తర్వాతే కాంగ్రెస్ తన వైఖరి మార్చుకున్నదని పేర్కొన్నారు.
అయినా కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తూనే ఉన్నదని విమర్శించారు. సింగరేణిపై ముఖ్యమంత్రికి, మంత్రులకు సోయి లేదని మండిపడ్డారు. బొగ్గు గనులను వేలం వేయడం అంటే ఉరితాడును పేనడమేనని స్పష్టం చేశారు. తెలంగాణ హకులపై కేసీఆర్ ఎప్పుడూ వైఖరి మార్చుకోలేదని, భట్టి విక్రమార పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ తర్వాతే సింగరేణి బ్లాకులను ఆ సంస్థకే కేటాయించాలని భట్టి కోరారని గుర్తుచేశారు. భట్టి విక్రమార్క గురువారం చెప్పిన దానికి, శుక్రవారం చేస్తున్న దానికి పొంతన లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కూడబలుకుని డ్రామాలు ఆడుతున్నాయని, సింగరేణి కార్మికులు ఆ రెం డు పార్టీలను అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. సింగరేణి బ్లాకుల వేలంపై ఆ రెండు పార్టీల వైఖరి మారితే స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏదో బలహీనతతోనే పార్టీ మార్పు
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏదో బలహీనతతోనే పార్టీ మారుతున్నారని భావిస్తున్నట్టు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పోచారం ఇంటి దగ్గరకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ తదితరుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పోచారం బీఆర్ఎస్ నేత కనుక ఆయన ఇంటికి తమ నేతలు వెళ్లారని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు పాల్గొన్నారు.